కిరాణా వ్యాపారి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-05-13T15:03:30+05:30 IST

మండలంలోని కాశిపాడు గ్రామంలో డబ్బు కోసం ఓ వ్యక్తి వృద్ధ దంపతులపై..

కిరాణా వ్యాపారి దారుణ హత్య

డబ్బుకోసం దారుణానికి ఒడిగట్టిన హంతకుడు

దాడిలో భార్యకు తీవ్ర గాయాలు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రూ.6లక్షల విలువైన నగలు స్వాధీనం

పెదకూరపాడు మండలం కాశిపాడులో ఘటన


కాశిపాడు(పెదకూరపాడు)/గుంటూరు: మండలంలోని కాశిపాడు గ్రామంలో డబ్బు కోసం ఓ వ్యక్తి  వృద్ధ దంపతులపై దాడిచేసిన ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన  పులిపాటి రాధాకృష్ణమూర్తి(68), భార్య శివవెంకటనర్సమ్మతో కలిసి కిరణాషాపు నిర్వహిస్తున్నారు. ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా ముగ్గురూ గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ పనులు ముగించుకుని సోమవారం రాత్రి బెడ్‌రూరంలో నిద్రకు ఉపక్రమించారు. 11 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పిల్లా గోపి ఇంటిలోకి ప్రవేశించి డబ్బు, బంగారం ఇవ్వాలంటూ కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఘటనా స్థలంలోనే రాధాకృష్ణమూర్తి మృతిచెందగా శివ వెంకటనర్సమ్మకు తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయింది.


ఆమె ఒంటిపై ఉన్న రూ.6లక్షల విలువైన బంగారం తీసుకుని గోపి పరారయ్యాడు. తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన వెంకటనరసమ్మ గుంటూరులో ఉన్న కుమారుడు సురేష్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వారు వెంటనే 100కు ఫోన్‌ చేయడంతో పెదకూరపాడు ఎస్‌ఐ ఉయ్యూరు సోమేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లారు. 108 వాహనంలో ఆమెను గుంటూరు వైద్యశాలకు తరలించారు. డాగ్‌స్క్వాడ్‌ జాగిలం గోపి ఇంటి వద్దకు వెళ్లి ఆగడంతో అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరానికి ఉపయోగించిన కొడవలిని, బంగారాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీ కె.చక్రవర్తి, తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి, సీఐ తిరుమలరావు పరిశీలించారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు పెదకూరపాడు పోలీసుస్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వెంటనే స్పందించిన ఎస్‌ఐ సోమేశ్వరరావు, కానిస్టేబుల్‌ నాగరాజు, హెడ్‌కానిస్టేబుల్‌ను ఆయన అభినందించి వారికి రివార్డులను ప్రకటించారు. 


Read more