ఆధునికత.. ఆప్యాయత

ABN , First Publish Date - 2020-08-11T09:39:25+05:30 IST

రండిసార్‌ రండి కూర్చోండి.. బాగున్నారా... మంచినీళ్లు తాగుతారా.. మీ సమస్య ఏమిటి.. అంటూ చిరునవ్వుతో ఆహ్వానం..

ఆధునికత.. ఆప్యాయత

మారనున్న పోలీసు సిబ్బంది తీరు

పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకర వాతావరణం

కార్పొరేట్‌ కార్యాలయాలను తలపించేలా రూరల్‌ స్టేషన్లు

పోలీసు సిబ్బందికి కార్పొరేట్‌ ట్రైనర్లతో ప్రత్యేకంగా శిక్షణ

తరగతులను 13న ప్రారంభించనున్న డీజీపీ గౌతమ్‌సవాంగ్‌


గుంటూరు, ఆగస్టు 10: రండిసార్‌ రండి కూర్చోండి.. బాగున్నారా... మంచినీళ్లు తాగుతారా.. మీ సమస్య ఏమిటి.. అంటూ చిరునవ్వుతో ఆహ్వానం.. ఆప్యాయతతో కూడిన పలకరింపులు.. ఇదేదో కార్పొరేట్‌ ఆఫీసుకు వెళ్తే కనిపించే దృశ్యాలు కావు. ఇంతకాలం ఆటుగా వెళ్లాలంటే జనం భయపడే పోలీస్‌స్టేషన్లలో దృశ్యాలు అంటే ఆశ్చర్య పోవద్దు. దురుసు ప్రవర్తన, అసభ్య ధూషణలతో చెలరేగిపోతుండే పోలీసుల తీరులో మార్పు రానున్నది. అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉండే స్టేషన్ల పరిసరాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు స్వాంతన చేకూర్చి పోలీసులపై ప్రజల్లో నమ్మకం, గౌరవాన్ని పెంపొందింపచేయాలని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ భావిస్తున్నారు. సాధారణంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాలంటేనే బాధితులు వెనకాడే పరిస్థితి. పోలీసుశాఖలో ఎన్ని సంస్కరణలు, సాంకేతికపరమైన మార్పులు వస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరులో మార్పు రావడంలేదు. దీంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని రూరల్‌ ఎస్పీ భావిస్తున్నారు.


వివిధ రకాలైన సమస్యలతో వచ్చే బాధితులపై దురుసుగా మాట్లాడడం, సరైన సమాధానం చెప్పకపోవడం వంటివి పోలీస్‌స్టేషన్‌లో నిత్యకృత్యంగా ఉన్నాయి. అయితే వారిలో మార్పు కోసం ఇప్పటి వరకు పోలీసు ఉన్నతాఽధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, సంస్కరణలు అమలు చేసినా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో వారిలో మార్పు కోసం  ఇప్పటికే రూరల్‌ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను ఆధునికీకరించారు. స్టేషన్లన్నింటికి ఒకే రంగు వేశారు. అంతేకాక కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలపించేలా రిసెప్షన్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. స్టేషన్‌ పరిసరాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షనిస్టులు, సంబంధిత ఎస్‌ఐలకు పోలీసు కార్యాలయంలో  హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్‌ ట్రైనర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించబోతున్నారు. రోజుకు 30 మంది చొప్పున ఒక్కో బ్యాచ్‌కు రెండు రోజుల పాటుశిక్షణ ఇప్పించనున్నారు. శిక్షణ తీసుకున్న తరువాత పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తున్నారనేది కూడా బాధితుల నుంచి సమాచారం సేకరించబోతున్నారు. ఈ ప్రయోగం ఫలవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భావిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఈ నెల 13న గుంటూరులోని పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐలు, రిసెప్షన్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించనున్నారు. రూరల్‌ ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో పోలీసుశాఖపట్ల నమ్మకం, గౌరవం పెరగాలంటే స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మాట్లాడడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించినట్లు అవుతుందన్నారు.  

Updated Date - 2020-08-11T09:39:25+05:30 IST