మెరకల్లోనూ.. మేత

ABN , First Publish Date - 2020-12-30T05:12:06+05:30 IST

డెల్టాలో ఇళ్ల స్థలాలు సిద్ధం చేసే విషయం ఇటు నేతలకు, అటు అధికారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

మెరకల్లోనూ.. మేత

ఇళ్ల స్థలాల చదునులో నేతల కక్కుర్తి

స్వపక్ష నేతలైనా కప్పం కట్టాల్సిందేనని పట్టు

కృష్ణానదిలోని బుసక మన్నుకూ ప్రైవేటు పన్ను

నేతల ధన దాహంతో జగనన్న రత్నాలకు ఆటంకం

డెల్టాలో అధికార నేతల మధ్యే కాకరేపుతోన్న వ్యవహారం  

పట్టాల పంపిణీ ముగిశాక సీఎం వద్దకు వసూళ్ల పంచాయితీ?


అధికార పార్టీ అభివృద్ధి పని మొదలు పెడితే దానిలో లోపాలను గుర్తించి ప్రతిపక్షం అడ్డుతగలడం సహజం. కానీ ప్రస్తుతం పని చేపట్టేది అధికార పక్షమే.. అడ్డుతగిలేదీ ఆ నేతలే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల్లో ప్రధానమైన ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అధికార నేతలు కొందరు అడ్డుతగులుతున్నారు. ఇళ్ల స్థలాలకు పొలాల కొనుగోళ్లలో రూ.వందల కోట్లు వెనకేసుకున్న నేతలు ఇప్పుడు వాటి మెరకలు, రోడ్లు వేయడంలో కూడా కక్కుర్తి చూపటం విమర్శలకు తావిస్తోంది. డెల్టాలో మట్టికి కొరత ఉండటంతో గ్రావెల్‌, బుసక మన్ను తవ్వకాలుకు, తరలింపులకు ప్రైవేటు పన్ను విధించి భారీ వసూళ్లకు దిగటం ఆ పార్టీ నేతల్లోనే కాక రేపుతోంది. అధికారులే స్వయంగా ఏ నియోజకవర్గానికి ఎక్కడ తవ్వుకోవాలనే ప్రదేశాన్ని నిర్ణయించి, ప్రభుత్వ సిబ్బందిని అక్కడ ఉంచినా, తవ్వకాలు మాత్రం నేతలు చెప్పిన ప్రకారమే సాగటం విశేషం.


తెనాలి, డిసెంబరు 29  (ఆంధ్రజ్యోతి): డెల్టాలో ఇళ్ల స్థలాలు సిద్ధం చేసే విషయం ఇటు నేతలకు, అటు అధికారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లో నేతల మధ్యే ఇళ్ల స్థలాల మెరకల వ్యవహారం సెగ రాజేస్తోంది. డెల్టా ప్రాంతంలో మట్టికి కొరత కారణంగా గతంలో స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు మెరక చేసుకోలేక వాటిని వదిలేసేవారు. అయితే ప్రస్తుత జగన్‌ సర్కారు అటువంటి ఇబ్బందులు లేకుండా లేఅవుట్లను చదును చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇళ్ల సంగతి అటుంచితే, పట్టాల పంపిణీకి ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రావెల్‌, బుసక విషయంలో అనుమతులు ఇచ్చినా నేతల కక్కుర్తితో అధికారులు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుందని సమాచారం. చివరకు చేసేదిలేక రోడ్లు వేయకుండా, మెరకలు తోలకుండానే ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల జనం నుంచి వ్యతిరేకత వస్తుందని  ఇంతా చేసి ప్రయోజనం కంటే, నష్టమే ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రుల దృష్టికి ఆయా నేతలు సూచన ప్రాయంగా తీసుకు వెళ్లినట్టు సమాచారం. ఈ వసూళ్ల వ్యవహారాన్ని ఇలానే వదిలేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని, ప్రతిపక్షం దగ్గరకూడా చులకన అవుతామనే ఆలోచనలో ఉన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి వద్దకు ఈ వసూళ్ల పంచాయతీ తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


గ్రావెల్‌, బుసకలకు అదనపు వసూళ్లు

డెల్టాలోని ఇళ్ల స్థలాల లేఅవుట్లలో రోడ్లు వేయాల్సి ఉంది. దీనికోసం తెనాలి, వేమూరు, రేపల్లె, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాలకు ఎక్కువశాతం చేబ్రోలు మండలంలోని గ్రావెల్‌ క్వారీల నుంచి గ్రావెల్‌ తరలింపునకు అనుమతులిచ్చారు. ప్రభుత్వ పనులకే కావటంతో లోడింగ్‌ చార్జీలు మినహా ఇతర వసూళ్లు ఏమీ లేకుండానే తవ్వకాలకు అనుమతిచ్చారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు ఇది సజావుగానే సాగింది. ఇక్కడ గ్రావెల్‌ తవ్వకాలకు వినియోగించే ఎక్సకవేటర్ల తమవే ఉండాలంటూ పొన్నూరు నేతలు అడ్డుపడ్డారని తెలిసింది. దీని గురించి మిగిలిన నియోజకవర్గాల నేతలు అంతగా పట్టించుకోలేదు. దీంతో పొన్నూరు నియోజకవర్గ నేతల అనుయాయులే యంత్రాలు పెట్టి అదనపు వసూళ్ళకు తెరలేపారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోని స్థలాల మెరకలకు అవసరమైన గ్రావెల్‌ కోసం క్వారీలో రూ.వెయ్యి చెల్లించనిదే లోడు చేయడంలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు చేసేదిలేక మొదటి పని జరగాలని వారడిగినంత చెల్లించి తవ్వుకొచ్చిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల ఎమినిటీ సిబ్బందిపై కొన్ని సార్లు దౌర్జన్యాలు జరిగిన విషయాన్ని  వారి నియోజకవర్గ నేతల దృష్టికి తీసుకువెళ్లినా పనులు పూర్తయ్యాక ఆ వ్యవహారం చూద్దామని సర్దిచెప్పినట్లు సమాచారం.


అధికారులు అనుమతులున్నా..

ఇళ్ల స్థలాల్లో మెరకలకు కృష్ణా నదిలోని పాయల మధ్య ఉన్న బుసక మన్నును తరలించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. తెనాలి సబ్‌కలెక్టర్‌ గతంలోనే కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో నది మధ్యలోని దిబ్బలను గుర్తించారు. కొల్లిపర మండలంలోని స్థలాలకు బొమ్మువానిపాలెం నుంచి ఏ ఇబ్బంది లేకుండా గతంలోనే మెరకలు వేశారు. గాజుల్లంకలో తవ్వకాలకు అనుమతినిస్తే, ఆ మండలంలోని అధికారపార్టీ నేతలే అడ్డు తగిలారు. దీంతో స్థానిక నేతతో మిగిలిన నియోజకవర్గాల నాయకులు మాట్లాడటం, ఆయన సరేననటంతో లారీలు పంపించారు. అయితే స్థానిక నేతలు మాత్రం రెండు లారీలు పోసుకు వెళితే, ఒక లారీ బుసక తాము చెప్పిన చోటకు తోలాలని షరతు పెట్టడంతో లారీలను వెనక్కు తీసుకువెళ్లినట్లు సమాచారం.


అధికారులకు.. షోకాజ్‌లు

ఇళ్ల స్థలాల చదునుకు, రోడ్లకు అవసరమైన గ్రావెల్‌, బుసకలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే వాటి తవ్వకాలకు, తరలింపులకు అధికార నేతలు అడ్డుపడుతున్నారు. తాము అడిగినంత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ పనులు సాగడంలేదు. వీరి కారణంగా ఉన్నతాధికారుల నుంచి మండల అధికారులు చివాట్లు, మెమోలు అందుకోవాల్సి వస్తోంది. స్థానిక నేతలే ఆటంకంగా మారడంతో ఉన్నతాధికారులకు చెప్పుకోలేక అవస్థ పడుతున్నారు. ఇప్పటికి రెండు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు కలెక్టర్‌ నుంచి షోకాజ్‌ నోటీసులు, మెమోలు అందుకున్న పరిస్థితి నెలకొంది. 


ఎవరైనా కప్పం కట్టాల్సిందే

రేపల్లె నియోజకవర్గ పరిధిలోని ఇళ్ల స్థలాలకు అవసరమైన గ్రావెల్‌ను పొన్నూరు నుంచి తరలించాలి. ఈ లారీలను ఇటీవల పట్టణ పోలీసులు ఆపేశారు. అదేమని ప్రశ్నిస్తే లారీకి రూ.10 వేల చొప్పున కప్పం కడితేనే కదలనిస్తామని పోలీసుల వెనకుండి నేతలు హుకుం జారీ చేశారని సమాచారం. లారీలు తీర ప్రాంతానికి చెందిన కీలక నేత సోదరుడికి సంబంధించినవే. అయినా పోలీసులు స్థానిక నేతలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో చేసేదిలేక ఒక్కో లారీకి చెప్పినంత మొత్తం చెల్లించి గ్రావెల్‌ తోలుకోక తప్పలేదనేది సమాచారం. బాపట్లలోని స్థలాలకుకూడా ఇదే పరిస్థితి ఎదురైనా.. ఉపసభాపతి నియోజకవర్గం కావటంతో కొంత చూసీచూడనట్టు వదిలేశారని సమాచారం.


అనధికార వసూళ్లు

తెనాలి, ఇతర మండలాల్లోని మెరకలకు అవసరమైన మన్ను కోసం కొల్లూరు మండలం గాజుల్లంక, భట్టిప్రోలు మండలంలోని ఓలేరు దగ్గర నదిలో తవ్వుకునేందుకు ప్రస్తుత సబ్‌కలెక్టర్‌ అనుమతులిచ్చారు. అయితే అనుమతులున్నా స్థానిక నాయకులు తవ్వకాలకు అడ్డుతగిలి  లారీకి రూ.700 చెల్లించాలని ఆంక్షలు పెట్టారు. సీనరేజి రూ.వెయ్యి చెల్లించాలని మరో అనధికార ఉత్తర్వులు జారీ చేయించారు. పొన్నూరులో గ్రావెల్‌కు కప్పం కట్పించుకున్నప్పుడు తాము ఓలేరు దగ్గర నుంచి మట్టిని ఊరకనే ఎలా వదులుతామంటూ ఓ నేత అనుయాయులు అడ్డుపెట్టారని సమాచారం. మిగిలిన నియోజకవర్గాల నుంచి వెళ్లిన లారీలకు కూడా అడ్డుతగలటంతో వెనుదిరగాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల నేతలు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవటంతో తవ్వకాలు ఆగిపోయాయి.  

Updated Date - 2020-12-30T05:12:06+05:30 IST