మద్యం అమ్మకాలపై మల్లగుల్లాలు...

ABN , First Publish Date - 2020-03-23T08:37:23+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా జనసంచారాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన ప్రభుత్వం ఈనెలాఖరు వరకు కూడా...

మద్యం అమ్మకాలపై మల్లగుల్లాలు...

  • ఇంకా ఒక నిర్ణయానికి రాని ప్రభుత్వం
  • ఆదేశాల కోసం జిల్లా ఎక్సైజ్‌ అధికారులు పడిగాపులు
  • తెలంగాణలో 31 వరకు నిషేధం ప్రకటించిన కేసీఆర్‌
  • నిత్యావసరాలకే అనుమతి అని జగన్‌ ప్రకటించినా మద్యం ఉత్తర్వులు జారీ చేయని ప్రభుత్వం


గుంటూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) :  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా జనసంచారాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన ప్రభుత్వం ఈనెలాఖరు వరకు కూడా కర్ఫ్యూ తరహాలో కాకున్నా ఇంచుమించు అదే మేరకు కట్టడి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం నిత్యావసర వస్తువుల విక్రయాలకే అనుమతి ఉంటుందని ప్రకటించారు. అయితే మద్యం విషయంలో ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా ఎటువంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో జిల్లా యంత్రాంగం పరిస్ధితి అయోమయంగా ఉంది. ఆదివారం మాత్రం జనతా కర్ఫ్యూలో భాగంగా వీటిని మూయించేశారు.


సోమవారం నుంచి పరిస్ధితి ఏమిటనేది మాత్రం అర్ధరాత్రి వరకు కూడా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తూ జిల్లా ఎక్సైజ్‌ అధికారులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. ఆదేశం వెలువడినా కూడా కలెక్టర్‌ సంతకం చేయనిదే మద్యం దుకాణాలను, బార్లను మూయించేందుకు వీల్లేదని అధికారులు అంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఈనెలాఖరు వరకు మద్యం అమ్మకాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీటి విషయం గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ నిత్యవసరాల అమ్మకాలకు మాత్రమే అనుమతి అంటూ ప్రకటించడంతో మిగతా అన్నింటికి కూడా నిషేధం వర్తిస్తుంది.


అయితే అధికారికంగా ఆదేశాలు అందకపోవడంతో నేటి నుంచి మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌ అని ఎక్సైజ్‌ అధికారులు ప్రకటన చేయలేకపోతున్నారు. పైగా మద్యం దుకాణాలు గతంలోలా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఆచరణ కష్టతరం అవుతుందని కావచ్చు... ప్రస్తుతం అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నందున మద్యం అమ్మకాలు కట్టుదిట్టం చేయడం ప్రభుత్వానికి ఎంతో సులువవుతుంది. కాగా బార్‌లు మాత్రం ప్రస్తుతానికి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. వారికి ఇప్పటి వరకు రేపటి నుంచి మూసి వేయాలనే ఆదేశాలు అందలేదు. ఆదివారం ఒక్క రోజు మాత్రమే మూసివేయాలని ఆదేశాలు ఉండడంతో ఒక రోజు మాత్రమే మూసి వేశారు. అదే రేపు తెరవాలో లేదో తెలియకపోవడంతో బార్‌ యజమానులు అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి జన రద్దీ మిగతా వ్యాపారాల వద్ద కంటే వీటి వద్దే ఎక్కువగా ఉంటుంది. ఆదివారం అమ్మకాలు ఉండవని తెలియడంతో శనివారం రాత్రే మద్యం దుకాణాల వద్ద వందల సంఖ్యలో బారులు తీరి కొనుగోలుకు పోటీపడ్డారు. ఇదిలా ఉండగా వారం రోజులకు పైగా మద్యం దుకాణాలు మూతపడే అవకాశం ఉందని తెలుసుకున్న మద్యపాన ప్రియులు వళ్ళు గగుర్పొడుస్తుంది. పైగా ఇదే వారంలో తెలుగు సంవత్సరాది పండుగ ఉండడంతో మందు బాబులు మజా చేసుకోలేకపోతున్నామే అని వాపోతున్నారు. 


Updated Date - 2020-03-23T08:37:23+05:30 IST