-
-
Home » Andhra Pradesh » Guntur » govt employees work from home
-
50 శాతం మందికే అనుమతి
ABN , First Publish Date - 2020-03-24T10:04:24+05:30 IST
కోవిడ్-19 కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ టూ హోం విధానం ప్రారంభమైంది. కేవలం 50 శాతం సిబ్బందిని మాత్రమే ఆఫీసులకు...

- ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన విధానం
- మిగతా సిబ్బంది ఈ-ఆఫీసు ద్వారా ఇళ్ల నుంచి నిర్వహణ
- తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఇదే విధానం అమలు
గుంటూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కోవిడ్-19 కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ టూ హోం విధానం ప్రారంభమైంది. కేవలం 50 శాతం సిబ్బందిని మాత్రమే ఆఫీసులకు వచ్చి పని చేసేలా షెడ్యూల్ రూపొందించారు. మిగతా ఉద్యోగులు ఇంటి వద్ద కంప్యూటర్ల వద్ద కూర్చుని ఈ-ఆఫీసు ద్వారా ఫైళ్లని క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో గుంటూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని విభాగాలు బోసిపోయాయి. సందర్శకులను ఎవ్వరినీ కార్యాలయాల్లోకి అనుమతించొద్దని జారీ చేసిన ఆదేశాలను పకడ్బందీగా అమలు చేస్తోన్నారు. ఆఫీసు ప్రాంగణాల్లో చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు, హ్యాండ్‌వాష్ లిక్విడ్‌లు అందుబాటులో ఉంచారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్‌కుమార్ అన్ని కార్యాలయాలకు సర్క్యులర్ పంపించారు. ఆ మేరకు ఉద్యోగులకు ఒక వారం ఆఫీసులో, మరో వారం ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు పని విభజన చేశారు.
కలెక్టరేట్‌లోని వ్యవసాయం, రెవెన్యూ, పౌరసరఫరాలు, రోడ్లు, భవనాలు, మైనార్టీ వెల్ఫేర్, అటవీ, ప్లానింగ్ తదితర శాఖల్లో ఇప్పటికే ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. నీటిపారుదల శాఖ గుంటూరు సర్కిల్ ఆఫీసుతో పాటు జిల్లాపరిషత్తు, డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్, స్త్రీ, శిశు సంక్షేమం వంటి శాఖల్లోనూ వర్క్ టూ హోం తొలి వారం ఉద్యోగులను విభజించారు. వారికి నేరుగా ఆఫీసుకు వచ్చే మెయిల్స్ చూసే వెసులుబాటు కల్పించారు. ఇదివరకే ఈ-ఆఫీసులో పని జరుగుతోన్నందున సంబంధిత సాఫ్టువేర్‌లను ఉద్యోగుల పర్సనల్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేశారు. ఏమైనా ఆదేశాలు ఉంటే ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఉద్యోగులకు చేరవేస్తున్నారు.