-
-
Home » Andhra Pradesh » Guntur » GNT NEWS
-
మోటారు సైకిళ్ళ దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2020-10-31T07:48:17+05:30 IST
మండలంలోని ములకలూరు, జొన్నలగడ్డ, ఉప్పలపాడు, రావిపాడు తదితర గ్రామాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు.

నరసరావుపేట రూరల్, అక్టోబరు 30: మండలంలోని ములకలూరు, జొన్నలగడ్డ, ఉప్పలపాడు, రావిపాడు తదితర గ్రామాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసుస్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు ప్రకటించారు. నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామానికి చెందిన భువనగిరి శివప్రసాదు, మునగాల అంకమరావు వ్యసనాలకు బానిసై అర్ధరాత్రి సమయాల్లో గ్రామాల్లో సంచరిస్తూ రోడ్లపై పార్కింగ్ చేసిన మోటారు సైకిళ్లను అపహరించేవారు. నరసరావుపేట మండలంలో ఐదు, రొంపిచర్ల మండలంలో రెండు, సత్తెనపల్లి, చిలకలూరిపేట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున తొమ్మిది మోటారు సైకిళ్ళను చోరీ చేశారు. నరసరావుపేట మండలం ఇక్కుర్తి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిద్దరిని చాకచక్యంగా నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకుని విచారించగా చోరీల ఉదంతం వెలుగుచూసినట్లు డీఎస్పీ తెలిపారు. తొమ్మిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు హాజరు పరిచినట్టు తెలిపారు. నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ అచ్చయ్య, రూరల్ ఎస్‌ఐలు రోశయ్య, బాలకృష్ణ, రొంపిచర్ల ఎస్‌ఐ హజరత్తయ్య, ఫిరంగిపురం ఎస్‌ఐ సురేష్‌లను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.