మాట తప్పి.. మడమ తిప్పిన జగన్

ABN , First Publish Date - 2020-10-13T11:23:21+05:30 IST

రాజధాని అమరావతి విషయంలో జగన్‌ మాట తప్పి, మడమ తిప్పి ప్రజలను మోసం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ తెలిపారు.

మాట తప్పి.. మడమ తిప్పిన జగన్

‌రాజధాని మహిళల పోరాటం ఆదర్శనీయం 

పెనుమాక దీక్షా శిబిరంలో నారా లోకేశ్‌ 


తాడేపల్లి, అక్టోబరు 12: రాజధాని అమరావతి విషయంలో జగన్‌ మాట తప్పి, మడమ తిప్పి ప్రజలను మోసం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ తెలిపారు. అమరావతి దీక్షలు 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా సోమవారం ఆయన పెనుమాక రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో మహిళలు చేస్తోన్న పోరాటం ఆదర్శనీయమన్నారు. రైతులు పండించే పంట తింటూ బతికేవాళ్లు రైతులను అవమానిస్తారా అని ప్రశ్నించారు.


అమరావతిలో గ్రాఫిక్స్‌ అన్న నేతలు ఆ గోడలు ఎక్కి దూకితే వాస్తవం తెలుస్తుందని చెప్పారు. మరో బిహార్‌గా ఏపీని మార్చాలని చూస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాలకు మూడు బస్సులు తిప్పలేనివారు మూడు రాజధానులు కడతానంటూ కబుర్లు చెబుతున్నారన్నారు. 92 మంది రైతులు చనిపోతే పరామర్శించని జగన్‌ టీడీపీ శవరాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. 

 

పునర్విభజన చట్టాన్ని గౌరవించాలి : గల్లా 

రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని కేంద్రమే రూపొందించిందని, ఎవరైనా ఆ చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులతో  చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే న్యాయస్థానాలలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీనివాసరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి, నియోజకవర్గ పూర్వ ఇన్‌చార్జులు, గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాస్‌, కొమ్మారెడ్డి కిరణ్‌, కొల్లి శేషు, కళ్లం రాజశేఖర్‌రెడ్డి, జంగాల సాంబశివరావు, ఇబ్రహీం, పఠాన్‌ ఖాసింఖాన్‌, జానీ ఖాన్‌, జ్యోతిబసు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T11:23:21+05:30 IST