వేధింపుల అధికారిపై వేటు

ABN , First Publish Date - 2020-10-13T11:22:31+05:30 IST

అక్రమాలు, వేధింపుల అధికారిపై ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) గుంటూరు సూపరింటెండెంట్‌గా వ్యహరించిన ఎన్‌ బాలకృష్ణన్‌పై వేటు పడింది.

వేధింపుల అధికారిపై వేటు

సెబ్‌ సూపరింటెండెంట్‌ బాలకృష్ణన్‌ సస్పెన్షన్‌

 తొలుత సరెండర్‌.. తర్వాత సస్పెండ్‌ చేస్తూ జీవో

 అక్షర సత్యాలైన ఆంధ్రజ్యోతి కథనాలు


 గుంటూరు(కార్పొరేషన్‌), అక్టోబరు 12: అక్రమాలు, వేధింపుల అధికారిపై ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) గుంటూరు సూపరింటెండెంట్‌గా వ్యహరించిన ఎన్‌ బాలకృష్ణన్‌పై వేటు పడింది. సోమవారం ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జీవో 1567 జారీ చేశారు. గుంటూరు సెబ్‌ సూపరింటెండెంట్‌గా రెండేళ్లుగా పనిచేసిన ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా మహిళా అధికారులు, కార్యాలయ సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేశాడని విమర్శలు వచ్చాయి. తన కార్యాలయాన్నే పడక గదిగా మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.


తనకు లొంగని మహిళా అధికారులను టార్గెట్‌ చేసి, అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడని తేలింది. ఆయన వైఖరిపై ఈ ఏడాది జూలైలో ‘అపర కీచకుడు ఆ పోలీస్‌’ అని బాధితుల ఆవేదనను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. అయితే అప్పట్లో ఆయనపై విచారణకు ఓ మహిళా డీఎస్పీని నియమించారు. అయితే విచారణకు హాజరైన మహిళలను బెదిరించి సక్రమంగా విచారణ జరపకపోవడంతో ఆ విచారణ బుట్టదాఖలైంది. ఆ తర్వాత బాలకృష్ణన్‌ లైంగిక వేధింపులు తాళలేక గత నెలలో పెదకూరపాడు సెబ్‌ ఎస్‌ఐ గీత ఆత్మహత్యకు యత్నించింది. దీంతో  గత నెల 13న మరోసారి ఆంధ్రజ్యోతిలో ‘వేధింపుల పర్వం’ అనే శీర్షికతో కథనం వెలువడింది.


దీంతో స్పందించిన సెబ్‌ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు. బాలకృష్ణన్‌ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపిన అధికారులు గత నెల 26న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.  సమగ్ర విచారణ అనంతరం లైంగిక వేధింపులు నిజమేనని తేలింది. ఈ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-10-13T11:22:31+05:30 IST