ప్రలోభాలు.. బెదిరింపులు

ABN , First Publish Date - 2020-03-13T11:20:36+05:30 IST

ప్రలోభాలు.. బెదిరింపులు

ప్రలోభాలు.. బెదిరింపులు

గుంటూరు, మార్చి 12(ఆంధ్ర జ్యోతి): స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఏదో విధంగా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలనే ధ్యేయంతో అధికార పార్టీ నేతలు ముం దుకు సాగుతున్నారు. ప్రధానంగా మాట వినకపోతే హెచ్చరికలు  జారీచేస్తున్నారు. గెలుపే ప్రధానంగా అధికారం కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. కృష్ణానది ఒడ్డునే ఉన్న ఓ మండలంలో టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి పోటీ చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే సుమారు రూ.2 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి తన హయాంలో పూర్తి చేసిన పనులకు బిల్లులు రాలేదు. వారం రోజుల్లో బిల్లులు రాబోతున్నాయి. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండటం, బీసీ సామాజికవర్గానికి చెం దిన ఆ నేత ఓసీ జనరల్‌లో పోటీ చేస్తే తన వర్గం సహకరిస్తుంది. గెలుపు సునాయాసంగా ఉంటుందని అంచనా లు వేశారు. దీనిని అధికార పార్టీ పసికట్టింది. వెంటనే రంగంలోకి దిగింది. నామినేషన్‌ వేస్తే బిల్లులు రావని అధికార పార్టీ నేతలు హెచ్చరించారు. దీంతో బెదిరిపోయిన ఆ బీసీ నేత తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి నేను పోటీ చేయడం లేదని చేతులెత్తేశారు.

మా పార్టీలో చేరితే                 పాతబిల్లులు వస్తాయి...

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సీనియర్‌ నేత ప్రాతినిఽథ్యం వహించిన నియోజకవర్గంలో ఆయన వారసులు అడ్డగించడంతో పార్టీలోని ద్వితీయశ్రేణి నేతకు సుమారు రూ.50 లక్ష ల బిల్లులు రాలేదు. ఈ కారణంతో ద్వితీయ శ్రేణి నేత సీనియర్‌ నేతకు దూరం అయ్యారు. ఎన్నికల తరువాత గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతను తమ పార్టీలోకి ఆహ్వానించారు. రూ.50 లక్షలు బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. చేసేది లేక పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా మోసిన ద్వితీయ శ్రేణి నేత ఫ్యాన్‌ గుర్తు కిందకు చేరారు. 


బంధువులు బరిలో ఉంటే బదిలీ తప్పదు

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సమీప బంధువులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ తరపున పోటీకి సిద్ధమయ్యారు. బలమైన నేతలు రంగంలోకి దిగితే తమ విజయావకాశాలు దెబ్బతింటాయని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తమ ఎమ్మెల్యేల దృష్టికితెచ్చారు. దీంతో ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు ఆ ప్రాంతాల్లోని పోలీసులు, ఇతర నిఘావర్గాలు నేరుగా అభ్యర్థి బంధువులుగా ఉన్న అధికారులు, ఉద్యోగులు హెచ్చరికలు జారీచేశారు. ఎందుకైనా మంచిది మీ బంధువును బరిలో నుంచి తప్పించండి అంటూ మండల స్థాయిలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగులకు హెచ్చరికలు చేస్తున్నారు. ఎన్నికలు కావాలా? ఉద్యోగం కావాలా? తేల్చుకో అంటూ ప్రధానంగా డ్వాకా, డీఆర్‌డీఏ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు అధికార పార్టీ నేతల నుంచి హుకుం జారీ అవుతుంది. 


ఈ రెండు రోజుల్లో ఇంకా ఎక్కువ

నామినేషన్ల పర్వం ముగిసింది. పరిశీలన మొదటి దశ పూర్తి అయింది. మరో రెండు రోజుల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కొనసాగుతుంది.వీటినిదృష్టిలో ఉంచు కొని అధికార పార్టీ నేతలు తమ ప్రతాపాన్ని పెంచబోతున్నా రు. ఇప్పటికే మండల కార్యాలయం నుంచి నామినేషన్లు వేసి న ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాలు, జడ్పీ నుంచి జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాలు సేకరించారు. దానికి అనుగుణంగా నా మినేషన్ల ఉపసంహరణ బెదిరింపులు కొనసాగుతున్నాయి.  

Updated Date - 2020-03-13T11:20:36+05:30 IST