రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2020-03-13T11:15:12+05:30 IST

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

మంగళగిరి క్రైమ్‌, మార్చి 12: మంగళగిరి మండలంలోని ఆత్మకూరు జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో  డిగ్రీ విద్యార్థి ఒకరు మృతిచెందగా మరో విద్యార్థి గాయపడ్డాడు. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు నగరంలోని గోపాల్‌నగర్‌ ఐదో లైనుకు చెందిన  నీరుకట్టు శ్రీనివాసరావు కుమారుడు మదన్‌ (19) మంగళగిరి పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న కొండవీటి టవర్స్‌లో మరో స్నేహితుడు ప్రణీత్‌తో కలసి ఉంటూ  కురగల్లు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ) చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం  పనిమీద విజయవాడ వెళ్లిన మదన్‌కు ఆలసమైంది. దీంతో తనతోపాటు అదే కళాశాలలో చదువుతున్న విజయవాడకు చెందిన  త్రివేద్‌కు ఫోన్‌చేసి తాను విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద ఉన్నానని, తనను మంగళగిరిలోని తన రూమ్‌ వద్ద వదిలిపెట్టాలని కోరాడు. దీంతో త్రివేద్‌ తన ద్విచక్ర వాహనంతో  స్నేహితుడైన మదన్‌ వద్దకు చేరుకుని ఇద్దరు కలసి అర్ధరాత్రి మంగళగిరికి బయలుదేరారు. మార్గమధ్యలోని ఆత్మకూరు జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి వెనుకనే కూర్చొన్న మదన్‌ ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. ఈ ఘటనలో మదన్‌ తలకు రోడ్డు దెబ్బ తగిలి బలమైన గాయం కాగా ద్విచక్ర వాహనం నడుపుతున్న త్రివేద్‌కు గాయాలయ్యాయి.  మదన్‌తో కలసి మంగళరిలోని రూమ్‌లో ఉంటున్న ప్రణీత్‌కు త్రివేద్‌  ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో వెంటనే ఘటనా ప్రాంతానికి కారులో చేరుకున్న ప్రణీత్‌  ప్రమాదంలో గాయపడిన తన స్నేహితులిద్దరినీ చికిత్స నిమిత్తం ఎన్నారై వైద్యశాలకు తరలించాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో మదన్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రణీత్‌  జరిగిన విషయాన్ని మదన్‌ తండ్రి శ్రీనివాసరావుకు సమాచారాన్ని అందించాడు. ఆయన ఒంగోలు నుంచి బయలుదేరి ఆస్పత్రికి చేరుకుని కుమారుని మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు.  మృతుడి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-13T11:15:12+05:30 IST