కేసులకు వెరవం

ABN , First Publish Date - 2020-03-13T11:14:49+05:30 IST

కేసులకు వెరవం

కేసులకు వెరవం

నమ్మించి మోసం చేశారు

అమరావతి కోసం పోరు ఆగదు

రాజధాని ప్రాంత రైతుల స్పష్టీకరణ

 70 ఏళ్ల అవ్వల నిరాహార దీక్ష

86వ రోజూ కొనసాగిన ఆందోళనలు, నిరసనలు


గుంటూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):  ‘ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. ఇప్పటికే 3వేలకు పైగా కేసులు పెట్టారు. ఒక్కసారి జైలుకు వెళ్లినా అంతే, పదిసార్లు వెళ్లినా అంతే. పది నెలల ముందు తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయి.... ఇప్పుడు చూడండి. దీనిని బట్టే అర్థమవుతుంది మీ పాలన చక్కదనం... అంటూ వైసీపీ ప్రభుత్వ తీరును అమరావతి రైతులు నిప్పులు చెరిగారు. ఇప్పటికే 2,900కు పైగా కేసులు పెట్టారు... ఇంకెన్ని పెట్టుకుంటారో పెట్టుకోండ’ంటూ రాజధాని రైతులు నిబ్బరంగా చెబుతున్నారు.  అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ  వరుసగా 86వ రోజు గురువారం ఆందోళనలు కొనసాగాయి. వెలగపూడి, రాయపూడిలో 24 గంటల రిలేదీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లో దీక్షలు, ఆందోళనలు కొనసాగాయి. 


నమ్మి మోసపోయాం!

అవ్వ, తాత అంటూ ముద్దులు పెడితే నమ్మి మోసపోయామంటూ రాయపూడికి చెందిన 70 ఏళ్లు పై బడిన ముస్లిం మహిళలు 12 గంటల నిరాహార దీక్షకు కూర్చొన్నారు. రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవడంతో పనులు లేక తాము కుటుంబ సభ్యులకు భారమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్‌చేశారు. పింఛన్ల విషయంలోనూ మోసంచేశారు. అమరావతి విషయంలోనూ మాట తప్పారంటూ మండిపడ్డారు. పెదపరిమిలో మహిళలు నల్లబెలూన్లు పట్టుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వెలగపూడి దీక్షాశిబిరంలో సీఎం మనసు మారాలంటూ లక్ష్మీ, గణపతిపూజ నిర్వహించారు. 


తుళ్లూరు రైతుల లఘునాటిక

మూడు రాజధానులతో రాష్ట్రం నాశనమవుతుందంటూ సీఎం జగన్‌, మంత్రులు, కర్నూలు, విశాఖవాసుల వేషధారణలతో తుళ్లూరు రైతులు లఘు నాటకం ప్రదర్శించారు. కర్నూలులో హైకోర్టు పెట్టటం వల్ల ఉపయోగం ఏమిటని అక్కడ జిరాక్స్‌ సెంటర్లు పెట్టుకోవటం తప్ప ఏమి చేయగలమంటూ కర్నూలు వాసుల వేషధారులు వాపోయారు. మాకు రాజధాని వద్దు... ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో పులివెందుల పంచాయితీలు వద్దంటూ... విశాఖ వాసులు గగ్గోలుపెడుతున్నట్లుగా నాటికను ప్రదర్శిస్తూ సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇక రాష్ట్రంలో జగన్‌ పాలనతో ఒరిగిందేమీ లేదంటూ శుక్రవారం చిల్లుల గిన్నెలతో నిరసన తెలపనున్నట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు కృష్ణా జిల్లా నందిగామ మండలం చెరుకుంపాలెం మహిళలు సంఘీభావం తెలిపారు. అలానే విశాఖ, నెల్లూరు నుంచి పలువురు రైతులు అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు. 


అభివృద్ధి వికేంద్రీకరణకు ఓకే అని, పరిపాలన వికేంద్రీకరణ తగదని పెనుమాక దీక్షాశిబిరంలో పలువురు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులతో ప్రాం తీయ విభేదాలను వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తోందని, ఒక్క రాజధాని మాత్రమే ఉండాలని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు... ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ ఉండవల్లిలో నిరసనకారులు నినాదాలు చేసి ముఖ్యమంత్రి మొండివైఖరి విడనాడి రాష్ట్ర ప్రయోజనాలు కోసం పనిచెయ్యాలని జేఏసీ నేతలు కోరారు. 


మంగళగిరి మండలంలోని నవులూరు, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం  నాటికి  86వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా  పలువురు జేఏసీ నేతలు దీక్షలను సందర్శించి సంఘీభావం తెలిపారు. రైతు రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికీ శతవిధాలా ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా  నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అనేక మంది రైతులు, రైతు కూలీలపై తప్పుడు కేసులు బనాయించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-13T11:14:49+05:30 IST