ప్రమాదం బాటన ప్రజాస్వామ్యం

ABN , First Publish Date - 2020-03-13T11:13:05+05:30 IST

ప్రమాదం బాటన ప్రజాస్వామ్యం

ప్రమాదం బాటన ప్రజాస్వామ్యం

విపక్ష నేత చంద్రబాబు

మాచర్ల ఘటనలో బాధితుడికి పరామర్శ


మంగళగిరి, మార్చి 12: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిం ది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మనందరి ముందున్న బాధ్యతయ’ని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు చెప్పారు. మాచర్ల దాడి ఘటనలో గాయపడి మంగళగిరిలోని ఎన్నారై జనరల్‌ ఆసుపత్రిలో కిత్స పొందుతున్న న్యాయవాది కిశోర్‌ను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కిశోర్‌కు అందుతున్న వైద్యసేవల గురించి ఆసుపత్రి వైద్యులను విచారించారు. దాడి వివరాలను కిశోర్‌ను అడిగి తెలుసుకన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ మూకల దాడిలో గాయపడి చికిత్స పొం దుతున్న కిశోర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాచర్ల దాడి ఘటన అమానుషం...దారుణం.. అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడాన్ని గురించి ప్రజలు కూడ ఆలోచించాలి... ఇపుడు కూడా అందరం రాజీపడితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే వుండదు. ప్రజాస్వామ్యం లేకపోతే మనం ఎవర్నీ ప్రశ్నించలేం. ప్రశ్నించే పరిస్థితే లేకపోతే వీళ్ల దయాదాక్షిణ్యాలపై బతకాల్సివస్తుంది. అదే జరిగితే స్వాతంత్య్రం కోసం ఏ నాయకులైతే పోరాడారో ఆ స్ఫూర్తిని... ఆ స్వాతంత్య్ర విలువల్ని మనం పూర్తిగా పోగొట్టుకున్నవాళ్లమవుతాం. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఘటనలపై తీవ్రంగా ఆలోచించాలని విపక్ష నేత చంద్రబాబు కోరారు. మాచర్లలో నామినేషన్లను వేయనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్న నేపథ్యంలో అక్కడివారికి న్యాయపరమైన సహాయాన్ని అందించేందుకు న్యాయవాది కిశోర్‌ వృత్తిధర్మంలో భాగంగా తమ పార్టీ నేతలతో కలిసి మాచర్ల వెళ్లారన్నారు. అక్కడ తమ పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నలతోపాటు న్యాయవాదిని కూడ వదలకుండా వైసీపీ కార్యకర్తలు వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దాడిలో గాయపడి కూడ పొరుగున వున్న తెలంగాణకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న న్యాయవాది కిశోర్‌ చికిత్సకోసం ఎన్నారై ఆసుపత్రిలో చేరారన్నారు. దాడిలో కిశోర్‌ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు ఎడమ కన్ను పోయేంత ప్రమాదం కలిగిందన్నారు. ఇంతటి అమానుషమైన దాడిని ఎదుర్కొన్నప్పటికీ న్యాయవాది కిశోర్‌ ధైర్యం కోల్పోకుండా వుండడం అభినందనీయమని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా జరపాల్సిన ఎన్నికలను ఇలా హింసాత్మకంగా మార్చివేసి అందర్నీ భయభ్రాంతుల్ని చేయడం ఆటవిక చర్యలని... ప్రజాస్వామ్యవాదులందరూ వీటిని గమనించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు వెంట పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఉన్నారు.

Updated Date - 2020-03-13T11:13:05+05:30 IST