మోగనున్న స్థానిక నగారా

ABN , First Publish Date - 2020-03-04T09:39:14+05:30 IST

మోగనున్న స్థానిక నగారా

మోగనున్న స్థానిక నగారా

 వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ 

డబ్బు, మద్యం కట్టడిపైనా చర్చ

50 శాతం రిజర్వేషన్లపై యంత్రాంగం కసరత్తు

నేటి మంత్రివర్గ సమావేశంలో అధికారిక ప్రకటన?

14వ ఆర్థిక సంఘం నిధుల కోసమే హడావిడి


నరసరావుపేట/గుంటూరు (ఆంధ్రజ్యోతి), మార్చి 3: స్థానిక సంస్థలకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్నికల అంశాన్ని నేరుగా ప్రస్తావించారు. ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు వినియోగంలోకి రావాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరి. ఈ నేపఽథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. 50శాతం రిజర్వేషన్‌ ప్రక్రియపై యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. 


కోర్టు తీర్పుతో జిల్లాలో రిజర్వేషన్లు పూర్తిగా మారనున్నాయి. గతంలో 59.85శాతం  మేరకు రిజర్వేషన్లు ప్రకటించారు. 50 శాతం రిజర్వేషన్‌లతోనే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఈ మేరకు రిజర్వేషన్లను స్థానికసంస్థలకు ప్రకటించనున్నారు.  వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికలపై దాదాపు 20నిమిషాలు చర్చించారు. కొత్తగా రూపొందించిన చట్టంపై కూడా చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీచేస్తూ పట్టుబడితే మూడేళ్ళు జైలుశిక్ష పడేలా చట్టాన్ని రూపొందించామని గుర్తుచేశారు. అయితే పురపాలకసంఘాలు, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ ఎన్నికల్లో ఏవి ముందు నిర్విర్తిస్తారన్న అంశంపై ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.


గతంలో ప్రకటించిన రిజర్వేషన్లతో పోటీకి సిద్ధమైన వారికి కోర్టు తీర్పు నిరాశను మిగిల్చింది. రిజర్వేషన్‌లు మారుతుండటంతో అశావహులు ఎన్నికల్లో పోటీచేసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే 50 శాతం రిజర్వేషన్‌లకు సంబంధించి కూడా కొన్ని మండలాలు, పురపాలక సంఘాలలో జాబితాలను సిద్ధంచేశారు. ఎన్నికలకు సంబంఽధించి ఉత్తర్వులు వెలువడగానే 50శాతం ప్రకారం రిజర్వేషన్‌ జాబితాలను ఉన్నతాధికారులకు అందించేందుకు ఇప్పటికే కొన్నిచోట్ల సిద్ధంచేశారు. విదార్థుల పరీక్షలతో ముడిపెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


అన్ని సిద్ధంగానే...

జిల్లాలో 57 జడ్పీటీసీలు,  1021 పంచాయతీలు, మునిసిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఒక్క రిజర్వేషన్‌లు మినహా మిగిలిని ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. వార్డుల వారీగా, పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. పోలీంగ్‌స్టేషన్‌ల గుర్తింపు, వీటిపై రాజకీయ పక్షాల అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశారు. తుది పోలింగ్‌ బూత్‌ల జాబితాలను ప్రకటించారు. బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధంచేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో దాదాపు 80శాతం పనులను మండలాలలో, మునిసిపాల్టీలలో పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ నెలలో స్థానిక ఎన్నికల సందడి నెలకొననున్నది. ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను దింపేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు సమాయత్తమవుతున్నాయి.    


14వ ఆర్థికసంఘం కింద పురాల్లో రూ.113.25 కోట్లతో పనులు

 పురపాలక సంఘాలలో 14వ ఆర్థిక సంఘం నిధులతో పెద్ద ఎత్తున ప్రగతి పనులు చేపట్టారు. వీటి విలువ రూ.113.25 కోట్లు. ఈ పనులకు టెండర్లు నిర్వహించారు.పురపాలక సంఘాలలో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. ఈ నిధులతో స్కూల్స్‌ను ‘నాడు నేడు’ పథకం కింద పనులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు పురాలల్లో పనులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరగకపోతే చేపట్టిన పనులకు నిధులు విడుదలయ్యే పరిస్థితి ఉండదు. ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయించడంతో పురపాలక అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 1021 పంచాయతీలకు ఆర్థిక సంఘం 4వ విడత నిధులు రూ.360 కోట్లకుపైగా విడుదల కావాల్సివుంది. ఈ నిధులు విడుదల కాక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎన్నికలు ఈ నెలాఖరుకల్లా పూర్తికాకుంటే పంచాయతీలకు, మునిసిపాల్టీలకు సుమారు  474 కోట్ల నిధులు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి ఈ నిధులను సద్వినియోగపరచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకొన్నది. దీంతో ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

 

ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో 57 జడ్పీటీసీలు, 856ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లుచేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 856 ఎంపీటీసీల పరిధిలో 24,42,850 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి 3066 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాం. క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల పోలింగ్‌, లెక్కింపు, నామినేషన్‌ పత్రాల స్వీకరణ తదితర అంశాలపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం. 

- చైతన్య, సీఈవో, జడ్పీ 

 

బ్యాలెట్‌ బాక్సులను సేకరిస్తున్నాం

జిల్లావ్యాప్తంగా 10,522 వార్డు మెంబర్లు, 1,017 గ్రామ సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తాం. సర్పంచ్‌ పదవుల రిజర్వేషన్లు జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఖరారవుతాయి. వార్డు మెంబర్ల రిజర్వేషన్లు, ఎంపీడీవో, ఈవోపీఆర్డీల ఆధ్వర్యంలో మండల కార్యాలయాల్లో నిర్ధారిస్తారు. జిల్లాలో ఎంపీడీవోల ద్వారా పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ స్టేషన్లను ఖరారు చేశాం. 

- దాసరి రాంబాబు, డీపీవో


 ఎన్నికలు జరగకపోతే కేంద్రం నిధులు రావు

స్థానిక ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు స్థానిక సంస్థలకు ప్రతి ఏటా వివిధ పథకాల కింద సుమారు రూ.10వేల కోట్లు విడుదలవుతాయి. ఎన్నికలు జరపకపోతే ఈ నిధులు విడుదల కావు. కోర్టు ఆదేశించడంతో ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏర్పాట్లు చేయాలి. 

- జాస్తి వీరాంజనేయులు, ఏపీ పంచాయతీ పరిషత్‌ చైర్మన్‌

Updated Date - 2020-03-04T09:39:14+05:30 IST