పదే పదే.. అవే తప్పులు! ప్రహసనంగా మారిన నర్సుల నియామకం

ABN , First Publish Date - 2020-12-16T03:55:10+05:30 IST

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నర్సుల నియామక ప్రక్రియ ప్రహసనంగా మారింది.

పదే పదే.. అవే తప్పులు! ప్రహసనంగా మారిన నర్సుల నియామకం
జీజీహెచ్‌

వివాదాల కేంద్రంగా జీజీహెచ్‌ పరిపాలన విభాగం


గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు 15: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నర్సుల నియామక ప్రక్రియ ప్రహసనంగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలకు, టీచింగ్‌ ఆసుపత్రులకు కరోనా సమయంలో అత్యవసరంగా కాంట్రాక్టు పద్ధతిపై నియామకాలు జరపాలని ప్రభుత్వం జూన్‌లో జీవో విడుదల చేసింది. నెల రోజులకే అన్ని జిల్లాలలోనూ నియామకాలు చేపట్టారు. కానీ కరోనా కేసులు తగ్గి వ్యాక్సిన్‌ దశకు వచ్చినా ఇక్కడ నియామకాలు జరగలేదు. సొంత నిబంధనలతో వారికి ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టాలనే ప్రయత్నమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువు జీజీహెచ్‌ పరిపాలన విభాగం. 


జీజీహెచ్‌ ఏడీ నిబంధనలు రూపొందించి దానికి ఓ కమిటీ నియమించి దాని ప్రకారం ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి నియామక పత్రాలు ఇవ్వాలి. ఇక్కడ అవేమీ జరుగలేదు.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు పాయింట్లు వేసుకున్నారు. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో విధులు నిర్వహించిన వారికి ఎక్కడా పాయింట్లు ఇవ్వలేదు.. కానీ జీజీహెచ్‌లో మాత్రం ఇచ్చారు. ఇది వివాదంగా మారింది.  అంతే కాకుండా గతంలో జీజీహెచ్‌లో కాంట్రాక్టు పద్ధతిపై చేసినవారికి పాయింట్లు కేటాయించారు. అయితే జీజీహెచ్‌లో చేసినట్లు జారీ చేసిన ధుృవీకరణ పత్రాలు కొన్ని నకిలీవని, కొందరు అభ్యంతరాలు తెలిపారు. ఇలా ఎనిమిదిమంది నియామకాల్లో జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ మొదటి మెరిట్‌లిస్టులోనే వచ్చాయి. నర్సుల నియామక ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటికి నాలుగుసార్లు మెరిట్‌లిస్టును రూపొందించారు. కానీ సరిచేసుకోకుండా పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు. వారం క్రితం జేసీ ప్రశాంతి ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారు. మెరిట్‌లిస్టు రూపొందించి వెరిఫై చేయమని జీజీహెచ్‌ పరిపాలన విభాగానికి పంపారు. వారు ఏమీ పరిశీలించకుండా అదే లిస్టు నెట్‌లో పెట్టారు.


ఇప్పుడు దానిపై కూడా 54 ఫిర్యాదులు రావడంతో ఈ వివాదంలో జేసీని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడో మెరిట్‌లిస్టులో తప్పులు దొర్లడానికి కారణమైన పరిపాలన విభాగంపై చర్యలు తీసుకోమని జేసీ ప్రశాంతి సూపరింటెండెంట్‌కు నోట్‌ పైల్‌ పంపారు. కానీ ఆమె చర్యలు తీసుకోకపోగా తప్పు తనపై వేసుకొని జేసీకి వివరణ అందించారు. పరిపాలన విభాగం తప్పు చేస్తే సూపరింటెండెంట్‌ను పక్కదోవ పట్టించి ఆమెను ఇందులో ఇరికించేలా ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఆసుపత్రిలో వినపడుతున్నాయి...!


Updated Date - 2020-12-16T03:55:10+05:30 IST