నిధుల గోల్‌మాల్‌లో సూత్రదారులెవరు?

ABN , First Publish Date - 2020-02-12T11:15:03+05:30 IST

కొండవీడు కోట ఉత్సవాల పేరుతో జరిగిన నిధుల స్వాహా వెనక అసలు సూత్రదారులెవరనేది మిష్టరీగా మారింది.

నిధుల గోల్‌మాల్‌లో సూత్రదారులెవరు?

  • ముగ్గురు అధికారుల పాత్రపై అనుమానాలు
  • కలెక్టరేట్‌ ఫిర్యాదుతో చిరుద్యోగిపై కేసుతో సరి
  • తొలి నుంచి ఈ వ్యవహారంలో అన్నీ అనుమానాలే

 

గుంటూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కొండవీడు కోట ఉత్సవాల పేరుతో జరిగిన నిధుల స్వాహా వెనక అసలు సూత్రదారులెవరనేది మిష్టరీగా మారింది. ఒక చిరుద్యోగిపై పోలీసు కేసు పెట్టి అధికారులు చేతులు దులుపుకొన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్‌లో జరిగిన ఈ స్కామ్‌లో ప్రధానంగా ముగ్గురు అధికారుల పాత్ర ఉన్నట్లు రెవెన్యూవర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూతో సంబంధం లేని ఒక అధికారి, మరో ఇద్దరు రెవెన్యూ అధికారులే ఆ ఫైలుని పెట్టించినట్లు చర్చ జరుగుతున్నది. ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఫైలు తీసుకెళితే దానిపై ఉన్నతాధికారి ఏమి చూడకుండా సంతకం పెట్టడం కుదిరే పని కాదు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తు జరిగితేనే కలుగులో దాగిన ఎలుకలు బయటకు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.  


గత ఏడాది నుంచి పెండింగ్‌

గత ఏడాది కొండవీడు కోటకు పర్యాటక హంగులు తీసుకొచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో బిల్లుల చెల్లింపులను అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ చేయలేకపోయారు. ఇదిలావుంటే కొద్ది రోజుల క్రితం పర్యాటక శాఖలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పని చేసే హీరా ఆ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన బిల్లులను ఫైలింగ్‌ చేసి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వద్ద సంతకం పెట్టించారు. ఇదిలావుంటే ఈ తతంగం వెనక ముగ్గురు అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ముగ్గురు కలిసి కలెక్టరేట్‌లోని సిబ్బంది ద్వారా ఫైల్‌ సిద్ధం చేయించి దానిని పర్యాటక శాఖ హీరా ద్వారా కలెక్టర్‌కు పంపించి సంతకం పెట్టించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు నుంచి వారిని తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలు నిగ్గు తేలిస్తే అసలు నిందితులు వెలుగుచూస్తారు. విజిలెన్స్‌ రంగంలోకి దిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.  

Updated Date - 2020-02-12T11:15:03+05:30 IST