అన్నదాత కంట.. అశ్రుగీత

ABN , First Publish Date - 2020-11-06T14:42:27+05:30 IST

తమది రైతు ప్రభుత్వం అని వైసీపీ నేతలు..

అన్నదాత కంట.. అశ్రుగీత

ఏడాదిన్నర పాలనలో.. 81 మంది ఆత్మహత్య

పెరుగుతున్న అన్నదాతల బలవన్మరణాలు 

అందరికీ అందని పరిహారం 

బ్యాంకర్ల నుంచి అందని రుణాలు

మరోవైపు ప్రకృతి విపత్తులు 

ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేతలో జాప్యం ఫ కారణాలేవైనా పెరుగుతున్న ఆత్మహత్యలు 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): తమది రైతు ప్రభుత్వం అని  వైసీపీ నేతలు ఓ పక్క గొప్పలు చెప్పుకొంటుండగా జిల్లాలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల బలవన్మరణాలు ఈ ఏడాదిన్నర కాలంలో పెరిగిపోయాయి. అప్పుల బాధలు, ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులు బలవంతంగా ఉసురు తీసుకొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు 81 మంది రైతులు బలవన్మరణం చేసుకున్నారు. 


జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు 81 మంది రైతులు బలవన్మరణం చేసుకున్నారు. జిల్లాలో 2014 నుంచి 2018 మధ్యన 120 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నట్లు అధికార యంత్రాంగానికి నివేదికలు అందాయి. వాటిని పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు విచారణ జరిపి 98 మందిని ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా పొందడానికి అర్హులుగా తేల్చాయి. వారందరికి కలిపి రూ.5.34 కోట్లు అప్పట్లో విడుదల చేశారు. కాగా 2019 జనవరి నుంచి మే నెలాఖరు వరకు మరో 21 మందిచనిపోతే కేవలం మూడు కుటుంబాలు మాత్రమే నష్టపరిహారం పొందేందుకు అర్హులుగా తేల్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు హడావిడి చేసింది. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబం వద్దకు కలెక్టర్‌, ఇతర అధికారులను పంపించి రూ.7 లక్షల చెక్కులను పంపిణీ చేయించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 81 మంది  చనిపోతే 52 మందిని అర్హులుగా నిర్ధారించారు. వారిలో 36 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేశారు. 


ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 32 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నివేదికలు జిల్లా యంత్రాంగానికి అందాయి. వాటిల్లో నాలుగు కేసులకు సంబంధించి ప్రతిపాదనలను మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. మిగతావి వివిధ కారణాలు, నివేదికలు రాలేదని పెండింగ్‌లో పెట్టారు. గత ఏడాది రైతు బలవన్మరణానికి పాల్పడిన వారం వ్యవధిలోనే కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వెళ్లి ఎక్స్‌గ్రేషియా చెక్కులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలావుంటే జిల్లాలో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడంలో సరిగా సహకరించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రూ.7,680 కోట్లు లక్ష్యం కాగా రూ.6,106.25 కోట్లు ఇచ్చారు.79.51 శాతం  పురోగతిని మాత్రమే సాధించారు. టర్మ్‌ లోన్‌ విషయంలో అయితే మరీ అధ్వాన్నంగా ఉంది. రూ.2,160 కోట్లు లక్ష్యం కాగా రూ.1,149.84 కోట్లు ఇచ్చారు. ఇందులో పురోగతి 53.23 శాతంగానే ఉన్నది. ఇక కౌలుదారుల విషయానికి వస్తే సీసీఆర్‌సీ కార్డులు 48,181 మందికి ఇచ్చారు. వారిలో రుణం పొందగలిగింది కేవలం 14,427 మంది మాత్రమే.


తగిన ఆర్థిక వనరులు సమకూరకపోతోండటం, గత ఏడాది వరదల వలన కలిగిన నష్టాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇటీవలే మంజూరు కావడం తదితర కారణాలతో చిన్న, సన్నకారు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 141 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 81మంది ఆత్మహత్యకు పాల్పడడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే బలవన్మరణాల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు.  


కల్తీలపై కన్నేదీ?

జిల్లాలో కల్తీ పురుగుమందుల విక్రయాలు విచ్చలవిడిగా సాగు తున్నాయి. ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన చిరు ద్యోగులే వీటికి సూత్రధారులుగా ఉన్నారు. రెండు నెలల క్రితం విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం పెదకాకాని, గుంటూరు ఆటోనగర్‌, రాజు పాలెం మండలం రెడ్డిగూడెంలో కల్తీ పురుగు మం దుల స్థావరాలను గుర్తించారు. రెండువారాల క్రితం పత్తిపాడు, మల్లాయపాలెం, వట్టిచెరుకూరు, యామర్రు, పల్లపాడు, గుంటూరు పట్నం బజారులో కల్తీపురుగు మందును గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు కల్తీ పురుగుమందు వ్యాపారులను అదుపులోకి తీసుకొని రాజకీయ ఒత్తిళ్లతో వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లపాడు పోలీసులు పదిరోజుల క్రితం జిల్లాలో కల్తీ కొరజాన్‌ పురుగు మందు తయారుచేసే రాకెట్‌ను అదుపులోకి తీసుకొన్నారు. సూత్రధారి హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది.  చిలకలూరిపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో రెండునెలల నుంచి కల్తీ పురుగుమందు అమ్ముతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.


పురుషోత్తపట్టణంలో కల్తీ పురుగుమందు అమ్ముతున్నట్లు జేసీ దినేష్‌ కు ఫిర్యాదు చేశారు. వ్యవ సాయశాఖ ప్రత్యేక బృందంతో జేసీ దాడులు చేయించారు. కల్తీ పురుగుమందుల నిల్వలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సొంత పొలంలో సాగు చేసిన  ఏపీ సీడ్స్‌ వరి విత్తనాలలో కేళీ గింజలు వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోళ్ళు ప్రారంభ మయ్యాయి. మార్కెటింగ్‌, సీసీఐ, వ్యవ సాయశాఖ అదికారుల మధ్య సమన్వయం లేదు. రోజుకో ఉత్తర్వులతో రైతుల్లో అయోమ యం నెలకొంది. 


నేడు మంత్రి కన్నబాబు సమీక్ష 

రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు శుక్రవారం గుంటూరులో ఆరు జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇందులో కలెక్టర్‌, జేసీలు, వివిద శాఖల సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పాల్గొంటున్నారు. జిల్లాలో కల్తీ పురుగు మందులు, వరిలో కేళీ గింజలు, సీసీఐ పత్తి కొనుగోళ్లు, వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం, పంటల బీమా తదితర అంశాలపై వివరాలు అందజేయటానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Updated Date - 2020-11-06T14:42:27+05:30 IST