చారిత్రక గురజాలను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-09-06T15:18:30+05:30 IST

శతాబ్దాలు చరిత్ర కలిగిన గురజాలను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే..

చారిత్రక గురజాలను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే

దాచేపల్లి(గుంటూరు): శతాబ్దాలు చరిత్ర కలిగిన గురజాలను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బ్రహ్మనాయుడి చాపకూటి సిద్ధాంతం, వశుదైక కుటుంబంలా ఉన్న గురజాల పల్నాడు చరిత్రలో భాగమన్నారు. జిల్లా కేంద్రం కావటానికి అన్ని వనరులు పల్నాడులో ఉన్నాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందటంతోపాటు నాగార్జునాసాగర్‌కు సమీపంలో ఉండటంతో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు.


ఈ ప్రాంతంలో వరి, మిర్చి, పత్తి పంటలను విస్తారంగా పండించటంతో పాటు, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు 85 శాతం మిరపకాయలు పల్నాడు ప్రాంతంలో పండించిన పంటలేనన్నారు. గురజాల జిల్లాకేంద్రంగా ప్రకటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, పల్నాడు జిల్లా ఏర్పాటుకు అన్నివర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని యరపతినేని పేర్కొన్నారు. ఈ నెల 15న గురజాలలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి పల్నాడు జిల్లా సాధనకోసం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

Updated Date - 2020-09-06T15:18:30+05:30 IST