సమష్టి సమరం
ABN , First Publish Date - 2020-02-08T09:40:02+05:30 IST
రాజధాని కోసమే బంగారం పండే భూములు త్యాగం చేశాం... మా త్యాగాన్ని వమ్ము చేయవద్దు.. అంటూ రాజధాని

- అమరావతి రాజధాని కోసం సర్వమతస్తులు ఆందోళన బాట
- మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
- రాయపూడి గ్రామ దేవతకు పొంగళ్లు పెట్టిన ముస్లిం మహిళలు
- కృష్ణమ్మకు సారె సమర్పించి వేడుకున్న రైతులు
- నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని ర్యాలీ
- మిన్నంటుతున్న అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ: రాజధాని కోసమే బంగారం పండే భూములు త్యాగం చేశాం... మా త్యాగాన్ని వమ్ము చేయవద్దు.. అంటూ రాజధాని రైతులు వేడుకుంటున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిచాలని కోరుతూ శుక్రవారం 52వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, గుంటూరు కలెక్టరేట్ ఎదురు, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.
అమరావతిని కాపాడు అల్లా..!
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. సీఎం జగన్ మనసు మార్చాలంటూ తుళ్లూరు రైతులు మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయపూడి కాలేషాబాబా దర్గాలో ముస్లిం, హిందూ సోదరీమణులు, సోదరులు పవిత్ర పార్థనలు నిర్వహించారు. మందడం నుంచి పాదయాత్ర చేసుకుంటూ రైతులు, మహిళలు వెలగపూడి నిరాహార దీక్ష శిబిరానికి వచ్చారు. ఫ మా ఏకైక డిమాండ్ అమరావతే అంటూ రాయపూడి ముస్లిం మహిళలు బొడ్డు రాయికి హిందూ సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామదేవత పొలేరమ్మకు దళిత, ముస్లిం మహిళలు పొంగళ్లు పెట్టి అమరావతి రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ పూజలు నిర్వహించారు. రాయపూడి కృష్ణా ఘాట్‌లో శుక్రవారం వెలగపూడి రైతులు జలదీక్ష నిర్వహించారు. కృష్ణమ్మకు చీరె, సారె సమర్పించి అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ వేడుకొని హారతులు ఇచ్చి వేడుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం జగన్‌కు తొత్తులా ఆయన మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదపరిమిలో రైతులు, మహిళలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌనంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.
ముగిసిన 151 గంటల నిరాహార దీక్ష
వెలగపూడి దీక్షా శిబిరంలో యువ రైతులు తాడికొండ శ్రీకర్, బొర్ర రవిచంద్రలు నిర్వహిస్తున్న 151 గంటల నిరాహా దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. వారికి రైతులు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు. అనంతరం యువ రైతులు మాట్లాడుతూ ఇప్పటికైనా వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు మూడు రాజధానుల విషయంపై పునరాలోచించి నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మందడంలో మూడవ తరగతి చదువుతున్న ఎర్రమనేని వరుణ్‌సాయి 24 గంటల నిరాహార దీక్షను చేశారు.
నేడు హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఎదుట నిరసన
విద్యార్థి జేఏసీ అధ్యర్యంలో హైదరాబాదులోని ఫిలిమ్‌నగర్‌లోని చాంబర్ ఎదురుగా శనివారం నిరసన తెలపునున్నారు. దీనికి సంబంధించిన పోస్టరును జేఏసీ కో కన్వీనర్ రావిపాటి సాయి నేతృత్వంలో ఆవిష్కరించారు. 52 రోజులుగా రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా టాలీవుడ్ వర్గాలు సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వారి వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలని ’మా’ అసోసియేషన్‌ను కలిసి విన్నవిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.