ఫాస్టాగ్ ఉంటేనే.. ఫిట్‌నెస్..!
ABN , First Publish Date - 2020-12-13T05:51:35+05:30 IST
టోల్‌ప్లాజాల వద్ద రవాణా వాహనాలకు ఫాస్టాగ్ అనివార్యం చేస్తూ కేంద్ర రవాణాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఫాస్టాగ్ ఉన్న వాహనాలకే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేలా నిబంధనలు కఠినతరం చేసింది.

థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ పొందాలన్నా ఫాస్టాగ్ తప్పనిసరి
కేంద్ర రవాణా శాఖ కొత్త మార్గదర్శకాలు
(ఆంధ్రజ్యోతి, గుంటూరు)
టోల్‌ప్లాజాల వద్ద రవాణా వాహనాలకు ఫాస్టాగ్ అనివార్యం చేస్తూ కేంద్ర రవాణాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఫాస్టాగ్ ఉన్న వాహనాలకే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేలా నిబంధనలు కఠినతరం చేసింది. టోల్‌ప్లాజాల వద్ద పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం గత డిసెంబరులో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ అది గాడిన పడకపోవడంతో ఓ అడుగు మందుకేసి ఫాస్టాగ్ ఉన్న వాహనాలకే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెలాఖరుకల్లా వాహనాలకు ఫాస్టాగ్‌లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వాహనం కొనే సమయంలోనే డీలర్లు ఫాస్టాగును జత చేస్తున్నారు.
సమస్యలూ ఉన్నాయి..
ఫాస్టాగ్‌ను తాము స్వాగతిస్తున్నామని.. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకోకుండా క్యాష్ లేన్లను పూర్తిగా ఎత్తివేయటం సమంజసం కాదని రవాణా రంగంలోని కొందరు వాదిస్తున్నారు. స్థానికంగా ఎక్కువసార్లు తిరిగేవారికి, ఎమర్జెన్సీగా బయటకు వచ్చే కార్లకు ఫాస్టాగ్ లేకపోతే ఇబ్బందులు ఎదురలయ్య అవకాశాలున్నాయి. ఫాస్టాగ్‌ను పొందటానికి బ్యాంకులో రూ.500 మినిమం జమ చేయాల్సి ఉంటుంది.
టోల్‌ప్లాజాలకు పండగే..
ఫాస్టాగ్‌ను నూరుశాతం అమలు చేయడంలో భాగంగా జరిమానాలు విధించడం టోల్‌ప్లాజాల నిర్వాహకులకు పండగగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. టోల్‌గేట్ మీదుగా వెళ్లి తిరిగి అటువైపే రావాల్సి వస్తే గతంలో రాక, పోక చార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు వన్‌వే ఛార్జీ అమలు చేస్తున్నారు. రాకపోక కలిపి రూ.150 వసూలు చేయాల్సిన చోట.. వెళ్లడానికి రూ.100, తిరిగి రావడానికి రూ.100 వేర్వేరుగా తీసుకుంటున్నారు. అంటే వాహనదారుని నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా కార్లను ఉపయోగించేవారు ఫాస్టాగ్‌ను ఆహ్వానిసస్తూనే ఒక క్యాష్ లేన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.