కలకలం రేపుతున్న నకిలీ బ్లీచింగ్ కుంభకోణం!

ABN , First Publish Date - 2020-05-17T15:16:39+05:30 IST

గుంటూరు జిల్లాలో నకిలీ బ్లీచింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. తొలుత రాష్ట్ర పంచాయతీరాజ్..

కలకలం రేపుతున్న నకిలీ బ్లీచింగ్ కుంభకోణం!

మిక్సింగ్ మాయేనా?

నకిలీ బ్లీచింగ్‌ ఎక్కడి నుంచి వచ్చింది..?

తాము డిసెన్‌ఫెక్టెడ్‌ పౌడర్‌ను మాత్రమే ఇచ్చామంటున్న కంపెనీ యజమాని

ఆ పౌడర్‌లో నకిలీ బ్లీచింగ్‌ కలిపారనే ఆరోపణలు !

దర్యాప్తు ప్రారంభించిన త్రిసభ్య కమిటీ


గుంటూరు(ఆంధ్రజ్యోతి): మేము బ్లీచింగ్‌ సరఫరా చేయలేదు. డిసెన్‌ఫెక్టెడ్‌ పౌడర్‌ను మాత్రమే సరఫరా చేశాం. ఇదీ పిడుగురాళ్ళ కంపెనీ యజమాని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పింది.  అయితే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అయిన బ్లీచింగ్‌ ఎక్కడ నుంచి వచ్చింది...? బిల్లులు మాత్రం పిడుగు రాళ్ళ నుంచి సరఫరా అయినట్లు చూపించారు. ఇదీ ప్రస్తుతం జిల్లా ప్రజలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కరోనా నియంత్రణలో భాగంగా గ్రామాలు, పట్టణాలలో చల్లడానికి పంపిణీ చేసిన నకిలీ బ్లీచింగ్‌ కుంభకోణం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా పిడుగురాళ్ల నుంచే ఈ నకిలీ బ్లీచింగ్‌ సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఇందులో కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు సమాచారం.  


గుంటూరు జిల్లాలో నకిలీ బ్లీచింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. తొలుత రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పిడుగురాళ్ళలో తయారవుతున్న డిసెన్‌ఫెక్టెడ్‌ పౌడర్‌ను కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఓ నేత సిఫార్సుల మేరకే ఈ పనిని ఒక కంపెనీకి అప్పగించారని తెలుస్తోంది. ఈ కంపెనీ యాజమానికి సున్నం తయారీ కేంద్రం మాత్రమే ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ప్రభుత్వం అనుతించిన డిసెన్‌ఫెక్టెడ్‌ పౌడర్‌నే సరఫరా చేశామని చెబుతున్నారు. అయితే కొందరు ఆ పౌడర్‌ను గుంటూరులోని ఓ గిడ్డంగికి చేరవేసి బ్లీచింగ్‌ లాగా కల్తీ చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొంతమంది నేతలు, అధికారులు సూత్రధారులుగా ఉన్నారు.


పిడుగురాళ్ళ నుంచి సరఫరా చేసిన బ్లీచింగ్‌ బస్తాలపై ఎటువంటి వివరాలు లేవు. రకరకాల పేర్లతో వీటిని సరఫరా చేశారు. బస్తాలపైన తయారీ తేదీ, తూకం, ఎంఆర్‌పీ ధర, గడువు తేదీ వంటి వివరాలు కూడా లేవు.  ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, కలెక్టర్‌ను కోరారు. వినుకొండ నియోజకవర్గంలో కరోనా బ్లీచింగ్‌, ఇతర పరికరాల బిల్లులు చెల్లించవద్దని  వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ అండతోనే ఈ కుంభకోణం జరిగిందని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌లు ఆరోపించారు.


దర్యాప్తు ప్రారంభం

కల్తీ, బ్లీచింగ్‌ కుంభకోణంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్‌ పటేల్‌ నాయకత్వంలో ఈ కమిటి శనివారం పెదకాకాని మండలం నంబూరు పంచాయతీని తనిఖీ చేసింది. కాలుష్య నియంత్రణశాఖ, విపత్తుల శాఖ ప్రతినిధులు కూడా కమిటీలో ఉన్నారు. నంబూరు పంచాయతీలో నిల్వ ఉన్న పిడుగురాళ్ల బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర పరికారాల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. బ్లీచింగ్‌కు సంబంధించి కొనుగోలు అనుమతి పత్రాలు, ఇతర వివరాలను సేకరించారు. జిల్లా పంచాయతీ అధికారులు ఈ బ్లీచింగ్‌ను పం పారని పంచాయతీ సిబ్బంది లిఖిత పూర్వకంగా తెలిపారు. కాగా పిడుగురాళ్ల నుంచి బ్లీచింగ్‌ స్థానంలో సరఫరా చేసిన సున్నం బస్తాలను స్థానిక సచివాలయంలో నిల్వ ఉంచారు.


కరోనా నేపథ్యంలో వీధి వీధినా బ్లీచింగ్‌ చల్లించాలని జిల్లా పంచాయతీ అధికారుల ఉత్తర్వుల మేరకు డివిజన్‌ అధికారులు బ్లీచింగ్‌ స్థానంలో  కొనుగోలు చేసిన సున్నం బస్తాలు కారంపూడి చేరాయి. ఇటీవల పిడుగురాళ్ల నుంచి సరఫరా చేసిన సున్నపు కుంభకోణం వెలుగు చూడడంతో వీటిని వినియోగించకుండా నిల్వ ఉంచారు. నకిలీ బ్లీచింగ్‌పై కేంద్ర  హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాకు ఫిర్యాదు చేశామని జాతీయ వినియోగదారుల సంఘం నాయకుడు చదలవాడ హరిబాబు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు ఏపీ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-17T15:16:39+05:30 IST