జగన్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది
ABN , First Publish Date - 2020-12-02T05:02:22+05:30 IST
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. మంగళవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. 2019-20 సంవత్సరాలకు గాను ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతోనే రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఆధారాల సహా అసెంబ్లీలో బయటపెట్టినందుకే టీడీపీ అధినేత చంద్రబాబును సస్పెడ్ చేశారని మండిపడ్డారు. టీడీపీ ఆందోళనతోనే అర్ధరాత్రి ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించాలని జీవో ఇచ్చినట్లు తెలిపారు. రైతుల కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆనందబాబు స్పష్టం చేశారు.