-
-
Home » Andhra Pradesh » Guntur » EMERGENCY SERVICES
-
ఆపదలో తక్షణ సాయం
ABN , First Publish Date - 2020-03-23T08:08:54+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో ఎటువంటి పరిస్ధితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు క్విక్ రియాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రూరల్...

- పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
- రూరల్ ఎస్పీ విజయరావు
గుంటూరు, మార్చి 22: కరోనా వైరస్ నేపథ్యంలో ఎటువంటి పరిస్ధితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు క్విక్ రియాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రూరల్ ఎస్పీ విజయరావు చెప్పారు. ఈ మేరకు ఆదివారం పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని 67 పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్‌తో జనతా కర్ఫ్యూపై సమీక్ష నిర్వహించి వారికి ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. షేక్‌హ్యాండ్స్ వద్దు నమస్కారం ముద్దు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడం శుభపరిణామం అన్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు రోడ్లపైకి వస్తారని, వారిని ఇబ్బందులకు గురి చేయకుండా వారితో మంచిగా మాట్లాడి కారణాలు తెలుసుకోవాలన్నారు. వారికి బాసటగా నిలిచి శానిటైజర్ అందజేయాలన్నారు. నిఘా వర్గాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను వైద్యశాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది అందరినీ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సమయంలో ప్రజలు తమను సంప్రదిస్తే తక్షణం స్పందించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. రూరల్ జిల్లా పోలీసుల తరుపున కరోనా వైరస్ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
5 గంటలకు పోలీసు కార్యాలయంలో చప్పట్లు
జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పోలీసు కార్యాలయంలో ఏఆర్, జిఎస్‌ఎస్ అధికారులు చప్పట్లు కొట్టి తమ సంఘీభావాన్ని చాటారు. జనతా కర్ఫ్యూ రోజున విధులు నిర్వహించిన డాక్టర్లు, నర్సులు, వలంటీర్లు, వైద్య సేవలు అందించిన ఆయా రకాల సిబ్బందికి, హెల్త్ వర్కర్లకు, సెక్యూరిటీ వారికి కృతజ్ఞతగా 15 నిముషాలు చప్పట్లు కొట్టారు. దీంతో పోలీసులు కార్యాలయం చప్పట్ల మోతతో దద్దరిల్లింది.