ఎన్నికల కమిషన్‌.. కొరడా!

ABN , First Publish Date - 2020-03-16T07:03:47+05:30 IST

జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఆయ న్ని వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించా ల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికల కమిషన్‌.. కొరడా!

ఎన్నికల విధుల నుంచి కలెక్టర్‌ తొలగింపు

రూరల్‌ ఎస్పీ బదిలీకి ఆదేశాలు

మాచర్ల సీఐ సస్పెన్షన్‌కు ఉత్తర్వులు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

ఎన్నికల విధుల్లో విఫలమే కారణం


గుంటూరు(ఆంధ్రజ్యోతి)ఎన్నికల కమిషన్‌ కొరడా ఝళిపించింది... అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులపై వేటు వేసింది. జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌పై కన్నెర్ర చేసింది. ఆయన్ని వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా పరిధిలో ఎన్నికల్లో దారుణాలు జరుగుతున్నా అరికట్టటంలో విఫలం అయ్యారనే కారణంగా రూరల్‌ ఎస్పీ విజయరావును బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే మాచర్ల సీఐ రాజేశ్వరరావును సస్పెండ్‌ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం ఉదయం ఎస్‌ఈసీ జారీ చేసిన ఈ ఆదేశాలు జిల్లా ఎన్నికల వర్గాల్లో కలకలం రేకెత్తించాయి.


జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఆయన్ని వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించా ల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేరొక అధికారిని జిల్లా ఎన్నికల అధికారిగా నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఎస్‌ఈసీ జారీ చేసిన ఈ ఆదేశాలు జిల్లా ఎన్నికల వర్గాల్లో కలకలం రేకెత్తించాయి. జిల్లా కలెక్టర్‌ని ఎన్నికల విధుల నుంచి తప్పించడం గత మూడు, నాలుగు దశాబ్ధాల్లో ఇక్కడ జరిగిన దాఖలాలు లేవు. అఖిలభారత సర్వీసు చివరి దశలో ఉన్న శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌పై వేటు పడటం ఆయన సర్వీసులో పెద్ద మచ్చ కానుంది. 


అడుగడుగునా వైఫల్యాలు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం వైఫల్యం గత కొన్ని రోజుల నుంచి అడుగడుగునా కనిపిస్తోంది. అధికార పార్టీకి పలుచోట్ల పంచాయతీరాజ్‌, పోలీసు అధికారులు, ఉద్యోగులు తొత్తులుగా మారి పని చేస్తున్నా ఎన్నికల అధికారి హోదాలో ఉన్న కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. గ్రామ/వార్డు వలంటీర్లు ఇష్టారాజ్యంగా అధికార పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ వైసీపీకి ఓటు వేయకపోతే మీకు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో స్థానిక అధికారులను నియమించరాదు. జడ్పీ సీఈవో చైతన్య, డీపీవో రాంబాబు జిల్లాకు చెందినవారు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై ఫిర్యాదు చేశారు. 


ప్రధానంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు జడ్పీటీసీ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక్క అభ్యర్థి కూడా బరిలో నిలబడకుండా వైసీపీ నేతలు బెదిరించారు. చివరి రోజున ఎస్‌టీ వర్గానికి చెందిన నాయక్‌ని బలవంతంగా తీసుకొచ్చి నామినేషన్‌ ఉప సంహరణ చేయించారు. మాచర్ల పట్టణంలో కూడా అసలు ఎన్నికలు జరగకుండా చేశారు. గురజాల నియోజకవర్గంలోనూ పిడుగురాళ్ల జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తప్ప వేరే అభ్యర్థులు లేకుండా చేసుకొన్నారు. నరసరావు పేట, డెల్టాలోనూ పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నది. వీటన్నింటిపై ఫిర్యాదులు అందినా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


బాపట్లలో వైసీపీకి మేలు చేర్చేలా ఉత్తర్వులు

బాపట్ల మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలుండగా వీటిల్లో 10 పంచాయ తీలను ఇటీవలే మునిసిపాలిటీలో విలీనం చేశారు. విలీనాల కారణంగా వార్డుల పునర్విభజన జరగాల్సి ఉండటంతో మునిసిపాలిటీ ఎన్నిక నిలిచిపోయింది. విలీనమైన పంచాయతీల్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉండదు. అయితే జిల్లా ఎన్నికల అధికారి హోదాలో ఆ ఓటర్లు జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు వేరుగా పేర్కొన్నారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌ విలీన పంచాయతీల్లో వైసీపీకి బలం ఉండటమేనని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. ఆ మేరకు ఎన్నికల సంఘానికి కూడా బాపట్ల టీడీపీ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్ర వర్మ ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రమేష్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌ని ఎన్నికల విధుల నుంచి తప్పించడం భావ్యంగా నిర్ణయించారు. 


జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, నామినేషన్‌ పత్రాలను గుంజుకోవడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినా ఉపసంహరించుకోవాలని బెదిరించడం వంటి ఘటనలు జరిగాయి. ఈ ఘటనలన్నింటి వెనుక పోలీసుల పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్నట్లు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక చోట్ల పోలీసులే ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఫోన్లు చేసి బెదిరించడం, స్టేషన్‌కు పిలిపించి వేధించడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. 


మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు చించివేసిన ఘటనలో తిరిగి వారితో నామినేషన్‌ వేయించేందుకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిషోర్‌లపై మాచర్లలో నడిరోడ్డులో పట్టపగలు ఆటవిక దాడి జరిగింది. ఇవే కాక జిల్లావ్యా ప్తంగా రేపల్లె, నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల, నియోజకవర్గాల్లో పోలీసులు బహిరంగంగానే అధికార పార్టీకి అండగా నిలిచి టీడీపీ అభ్యర్థులను బెదిరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల ఎటువంటి కేసులు లేని అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించేందుకు కూడా పోలీసులు యత్నించారు. రూరల్‌ జిల్లా పరిధిలో ఇంత దారణాలు జరుగుతున్నా అరికట్టటంలో విఫలం అయ్యారనే కారణంగా రూరల్‌ ఎస్పీ విజయరావును బదిలీ చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలను ఆదివారం సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. 


కొత్త ఎస్పీ ఎవరనేదానిపై చర్చ

రూరల్‌ ఎస్పీ విజయరావును బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన నేపథ్యంలో కొత్త ఎస్పీ ఎవరనేదానిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అర్బన్‌ పోలీస్‌ అధికారిగాడీఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ ఉన్నారు. ఆయనను రూరల్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తారా లేక రూరల్‌కు కొత్త ఎస్పీని నియమిస్తారా అనేది సోమవారం తేలే అవకాశం ఉంది.


ఏడాది తిరగకుండానే ఉద్వాసన

అఖిల భారత సర్వీసుకి 2006 బ్యాచ్‌లో ఎంపికైన తర్వాత ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌కు తొలి కలెక్టర్‌ పోస్టింగ్‌ గుంటూరు జిల్లానే. అలాంటిది ఏడాది తిరగకుండానే ఆయన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వలన ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఐదేళ్లలోనూ అప్పటి ప్రభుత్వాలు ఆయనకు జిల్లా కలెక్టర్‌ బాధ్యతని అప్పగించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో ఎవరూ ఊహించని విధంగా అమరావతి రాజధాని నగరం కలిగిన గుంటూరు జిల్లాకు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ని కలెక్టర్‌గా నియమించారు. శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం ఆదిలాబాద్‌ జిల్లాకు జాయుంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ అవుటర్‌ రింగురోడ్డుకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, ఎస్‌సీ కార్పొరేషన్‌, వైద్య ఆరోగ్య, మార్కెటింగ్‌ శాఖల్లో ఎండీ, వీసీ, కమిషనర్‌ హోదాల్లో విధులు నిర్వహించారు.


మూడు సందర్భాల్లో వివాదాస్పదం 

కలెక్టర్‌గా ఆయన మూడు సందర్భాల్లో వివాదం కొని తెచ్చుకొన్నారు. గత ఏడాది బైబిల్‌ కళాశాలలో జరిగిన సెమీక్రిస్మస్‌ వేడుకలకు హాజరైన కలెక్టర్‌ ఈ సంవత్సరం క్రైస్తవులందరికి ఎంతో శుభకరం. వేలమంది క్రైస్తవులకు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి. తనకు కూడా ఈ ఏడాది కలెక్టర్‌ ఉద్యోగం వచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు వెళ్లింది. అలానే గత ఏడాది కొండవీడు ఉత్సవాల నిర్వహణ జరగగా బిల్లుల చెల్లింపులో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. బ్లాక్‌లిస్టు చేసిన సంస్థకి రూ.కోటి 25 లక్షల వరకు బిల్లు చెల్లించారు.


దీని విషయంలో ఒక చిరుద్యోగి తనను మోసం చేశారని కలెక్టర్‌ పేర్కొంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వివాదాన్ని రేకెత్తించింది. తాజాగా ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మాచర్లలో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేదని ఆంధ్రజ్యోతి ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అలాంటి పరిస్థితి ఏమి లేదని, అన్ని చోట్ల నామినేషన్లు వేశారని నర్మగర్భంగా సమాధానం చెప్పారు. జిల్లా చరిత్రలో ఒక కలెక్టర్‌ని ఇలా ఎన్నికల విధుల నుంచి తప్పించడం ఇదే ప్రప్రథమంగా రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-03-16T07:03:47+05:30 IST