ఈసీకి చంద్రబాబు వైరస్ సోకింది: మంత్రి పేర్ని నాని
ABN , First Publish Date - 2020-03-16T15:19:30+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ..
మచిలీపట్నం(కృష్ణా): రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటన చేయడంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. రాష్ట్రానికి కరోనా వైరస్ రాలేదు కానీ, ఎలక్షన్ కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకిందన్నారు. ఈనెల 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 23వ తేదీన మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిన తరుణంలో హఠాత్తుగా ఆరు వారాల పాటు ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలు చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడుకు రమేష్‌కుమార్ సమీప బంధువు అని, ఆయన పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సమయంలో చంద్రబాబే ఎన్నికల కమిషనర్‌గా నియమించారని ముఖ్యమంత్రి జగన్‌కు తాము చెప్పామన్నారు. అయితే ఐఏఎస్ అధికారి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయరని ముఖ్యమంత్రి తమతో అన్నారన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ఎన్నికలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, దుర్మార్గాలు చేసినా వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.