కష్టపడినా గుర్తింపు లేదు..
ABN , First Publish Date - 2020-09-14T08:56:46+05:30 IST
వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీల పరిస్థితి దయనీయంగా..
శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీల ఆవేదన
పారిశుద్ధ్య కార్మికులు కూడా వీళ్లని లెక్క చేయని పరిస్థితి
కంట్రోల్ అంతా శానిటరీ ఇన్‌స్పెక్టర్ల చేతుల్లోనే
గుంటూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వేకువజామున 5.30 గంటలకే విధులకు హాజరు కావాల్సి వస్తుండటం, తగిన అధికారాలు వారికి లేకపోవడంతో ఒక విధంగా వ్యవస్థలో నామమాత్రంగా మారిపోయారు. పారిశుద్ధ్య కార్మికులకు పనిని పురమాయించేది శానిటరీ ఇన్‌స్పెక్టర్/ మేస్త్రీలు కాగా ఏదైనా సమస్య తలెత్తితే మునిసిపల్ అధికారులు అందుకు వార్డు ఎస్ అండ్ ఈ సెక్రెటరీలను బాధ్యులుగా చేస్తున్నారు. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో రోజంతా కష్టపడి తాము కంటైన్‌మెంట్ జోన్లలో సేవలందించినా తగిన గుర్తింపు రాలేదని ఆవేదన చెందుతున్నారు.
వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీలను ప్రభుత్వం నియమించింది. అయితే వీరికి పారిశుద్ధ్య కార్మికుల విధుల పర్యవేక్షణపై ఎలాంటి అధికారాలు లేవు. కార్మికులు సెక్రెటరీల మాట అస్సలు లెక్క చేయడం లేదు. రోడ్లు ఊడ్చడం, కాలువలు శుభ్రం చేయడం తదితర పనులు సరిగా చేయలేదని ప్రశ్నించినా వారు తమ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయడం లేదని పలువురు మహిళా వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీలు వాపోతున్నారు. కొందరు కార్మికులు ఉదయం పనికి వచ్చి మధ్యాహ్నం రావడం లేదు. మరికొందరు వారికి బదులు వేరే వారిని నియమించుకొన్నారు. ఇంకొందరు అయితే హాజరు(మస్టరు) పలికి పారిశుద్ధ్య పనులు చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో నగరంలో పారిశుద్ధ్యం సక్రమంగా అమలు జరగడం లేదు. ఈ విషయాలను తాము శానిటరీ ఇన్‌స్పెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సెక్రెటరీలు చెబుతున్నారు.
కాగా విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పబ్లిక్ హాలిడే/ ఆదివారం సెలవుదినాన్ని కూడా వీరు వినియోగించుకోలేని పరిస్థితి. నిత్యం విధులకు హాజరు కావాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ఆదివారం సెలవు ఇవ్వమని అడిగినా మా చేతుల్లో ఏమి లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. తమకు కూడా జాబ్‌ఛార్టుని ప్రకటించాలని కోరుతున్నారు. మూడు గంటల ఫీల్డ్ వర్కు అని చెప్పి నిత్యం ఎనిమిది గంటలు పని చేయిస్తున్నారని వాపోతున్నారు. జాబ్ ఛార్ట్ ప్రకారం జనన, మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్‌లు అన్ని సచివాలయం పరిధిలోనే నిర్వహించాలి. అయితే వీటి ద్వారా సైడు సంపాదన భారీగా ఉండటంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వాటిని వదలకుండా అంటి పెట్టుకొంటున్నారు.