శాసనమండలే ఉండొద్దంటున్న వైసీపీ.. ఎమ్మెల్సీగా డొక్కాకు అవకాశం..!

ABN , First Publish Date - 2020-06-25T15:18:41+05:30 IST

టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఐదు నెలల క్రితం రాజీనామా చేసి వైసీపీలో చేరగా ఆ స్థానానికి తిరిగి ఆయన్నే నిలబెట్టాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది.

శాసనమండలే ఉండొద్దంటున్న వైసీపీ.. ఎమ్మెల్సీగా డొక్కాకు అవకాశం..!

డొక్కాకే మళ్లీ అవకాశం

వైసీపీ అధిష్ఠానం నిర్ణయం

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ 


గుంటూరు (ఆంధ్రజ్యోతి): టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఐదు నెలల క్రితం రాజీనామా చేసి వైసీపీలో చేరగా ఆ స్థానానికి తిరిగి ఆయన్నే నిలబెట్టాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది.  బుధవారం ఉండవల్లిలో సీఎం జగన్‌, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు సమావేశమై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం ఆయన గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు ఆశీస్సులతో తాడికొండ టిక్కెట్‌ దక్కించుకున్న వరప్రసాద్‌ ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తిరిగి విజయం సాధించి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2014లో అప్పటి నరసరావుపేట ఎంపీ రాయపాటి సిఫార్సుతో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే చంద్రబాబునాయుడు ఆయనకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఆ తర్వాత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పదవి ఇచ్చారు. అనంతరం ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీలో అవకాశం కల్పించారు. 


అలానే 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పార్టీ టిక్కెట్‌ ఇవ్వగా ఓటమి పాలయ్యారు. ఇదిలావుంటే ఈ ఏడాది జనవరిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో చర్చకు రాగా అదే రోజు ఉదయం డొక్కా రాజీనామా చేశారు. రాజధాని తరలిపోవం ఇష్టం లేదని అందువల్లే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే వైసీపీ ప్రోద్బలంతోనే వరప్రసాద్‌ అలా చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అప్పటి నుంచి రాజకీయాలకు క్రియాశీలకంగా దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడటంతో వైసీపీ తరపున డొక్కాకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సంఖ్యాబలం దృష్ట్యా మాణిక్యవరప్రసాద్‌ గెలుపు లాంఛనమే. అయితే అసలు శాసనమండలి ఉండొద్దంటోన్న వైసీపీ నాయకులు తిరిగి ఎలా అభ్యర్థిని నిలబెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తోన్నారు.  

Updated Date - 2020-06-25T15:18:41+05:30 IST