కరోనా: ఇక్కడ దహనం చేయొద్దంటూ అడ్డుకున్న ప్రజలు.. పోలీసుల లాఠీచార్జ్..

ABN , First Publish Date - 2020-04-25T16:19:20+05:30 IST

తమ ప్రాంతంలోని శ్మశానవాటికలో కరోనా పాజిటివ్‌ మృతదేహానికి అంత్యక్రియలు చెయ్యవద్దంటూ శుక్రవారం గుంటూరు నగరంలోని స్తంభాలగరువు మహాప్రస్థానం

కరోనా: ఇక్కడ దహనం చేయొద్దంటూ అడ్డుకున్న ప్రజలు.. పోలీసుల లాఠీచార్జ్..

కాటికీ కష్టమే..! 

ఇక్కడ దహనం చెయ్యొద్దు..

కరోనా పాజిటివ్‌ మృతదేహం అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

రాళ్లు రువ్వడంతో అంబులెన్స్‌ అద్దం ధ్వంసం... పోలీసుల లాఠీఛార్జ్‌

గ్యాస్‌పై దహనం చేస్తున్నట్లు వివరించిన అధికారులు

శాంతించిన స్థానికులు.. కార్యక్రమం పూర్తి 


గుంటూరు (ఆంధ్రజ్యోతి): తమ ప్రాంతంలోని శ్మశానవాటికలో కరోనా పాజిటివ్‌ మృతదేహానికి అంత్యక్రియలు చెయ్యవద్దంటూ శుక్రవారం గుంటూరు నగరంలోని స్తంభాలగరువు మహాప్రస్థానం వద్ద స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. స్తంభాలగరువులో గల మహాప్రస్ధానంలో కరోనా పాజిటివ్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్స్‌ వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు మహాప్రస్థానం రోడ్డులో ఆటోలు, బండ్లు అడ్డంపెట్టి నిరసనకు దిగారు. తుఫాన్‌నగర్‌, మారుతీనగర్‌, రైలుకట్ట, భాగ్యనగర్‌ తదితర సమీప కాలనీలకు చెందినవారు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట ఇక్కడ పాజిటివ్‌ మృతదేహాలకు అత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో గ్యాస్‌ హీటర్‌పై దహనం చేస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే అందుకు భిన్నంగా కట్టెలపై దహనం చేయడంతో స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి శుక్రవారం కూడా కట్టెలతోనే దహనం చేస్తారని భావించిన స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. 


ఈ క్రమంలో ఓ మహిళ రాయి విసరడంతో అంబులెన్స్‌ అద్దం ధ్వంసం అయ్యింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ఆందోళన కారులను తరిమి వేశారు. అంబులెన్స్‌తో పాటు వచ్చిన తహసీల్దార్‌ మోహన్‌రావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావులు స్థానిక నాయకులతో చర్చించారు. మహాప్రస్థానం ప్రతినిధి లక్ష్మణరావు వచ్చి మృతదేహాన్ని గ్యాస్‌పై దహనం చేస్తున్నామని వారికి సూచించారు. 800డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతతో మృతదేహాన్ని దహనం చేస్తామని బాయిలర్‌ను వారికి చూపారు. పొగ గొట్టం 100 మీటర్ల ఎత్తులో ఉంటుందని వివరించారు. దీంతో స్థానికులు శాంతించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరిగి అంబులెన్స్‌ వెళ్లే సమయంలోనూ ఆందోళనకారుల అంబులెన్స్‌పై రాళ్ళు రువ్వారు. మృతదేహాలను నగరానికి దూరంగా, జనసంచారం లేని కొండ ప్రాంతాల్లో దహనం చేసుకోవాలంటూ కోరారు.

Updated Date - 2020-04-25T16:19:20+05:30 IST