ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-21T09:44:47+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపి వేశారు. అయితే అన్ని ఆలయాల్లో భక్తులకు సాధారణ దర్శనాన్నే

ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేత

(గుంటూరు(కార్పొరేషన్‌), అమరావతి, తెనాలి టౌన్‌, నరసరావుపేట రూరల్‌): కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపి వేశారు. అయితే అన్ని ఆలయాల్లో భక్తులకు సాధారణ దర్శనాన్నే కల్పించనున్నారు. ఆలయ ప్రవేశానికి ముందు భక్తులు చేతులు, కాళ్ళు సోప్‌తో, శానిటైజర్లతో శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. మాస్కులను, శానిటైజర్‌, ధర్మల్‌ గన్‌లను సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ధర్మల్‌గన్‌తో భక్తులను పరిశీలించిన తరువాతనే దేవాలయానికి అనుమతించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జ్వరంతో, జలుబు, దగ్గుతో ఉన్న వారితో పాటు ఎన్నారై, విదేశీ భక్తులను దేవస్థానంలోకి రానివ్వవద్దని ఆదేశించారు. పెదకాకాని మల్లేశ్వరస్వామి, అమరావతి అమరేశ్వరస్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, తెనాలి వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి, పొన్నూరు ఆంజనేయస్వామి, మాచర్ల చెన్నకేశవస్వామి, కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి, గుంటూరులోని లాలాపేట గ్రూపు దేవాలయాల్లో అన్ని రకాల అర్జిత సేవలు నిలిపివేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని దశావతార వేంకటేశ్వరస్వామి దేవస్ధానాన్ని ఈనెల 31 వరకు పూర్తిగా మూసివేశారు. పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రాహుకేతు పూజలను మాత్రమే కొనసాగించనున్నారు. ఆలయంలో ప్రవేశించిన భక్తులకు మధ్య కనీసం 3 అడుగుల దూరాన్ని ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల ఉత్సవాలను దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహించాలని, అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో గుమ్మికూడకుండా చూడాలన్నారు.  


- కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయానికి మొక్కు బడులు ఉన్న భక్తులు మాత్రమే రావాలని ఈవో అన్నపు రెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.  

- అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు, అన్నదాన కార్యక్రమాలు రద్దుచేస్తున్నట్లు ఈవో సునీల్‌కుమార్‌ తెలిపారు. స్వామి వార్లకు జరిగే అన్ని నిర్ణీత కాల పూజలు యథావిధిగా శాస్ర్తోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పదేళ్ల లోపు, 60 ఏళ్ల వయస్సు దాటిన వారు స్వామివారిని దర్శించుకోవడం వాయిదా వేసుకోవాలన్నారు.  

- తెనాలి వైకుంఠపురం దేవస్థాన ప్రాంగణంలో మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమణ నేతృత్వంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా నివారణ  చర్యలు చేపట్టారు. ఆవరణంతా సోడియం హైపోక్లోరైడ్‌  ద్రావణాన్ని పిచికారి చేశారు. క్యూలైన్లను క్రిసాల్‌ ద్రావణంతో శుభ్రం చేశారు. ఆలయంలో భక్తులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ధర్మకర్తల మండలి చైర్మన్‌ వుప్పల వరదరాజులు సూచించారు. వివాహాలు వీలైనంత మేర వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. భక్తులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. 21న దేవస్థానంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పర్యవేక్షణలో కరోనా వైరస్‌ వ్యాధి నివారణకు, లోక కల్యాణార్థం ధన్వంతరి  సహిత శ్రీవేంకటేశ్వర స్వామి మహాయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-21T09:44:47+05:30 IST