ముంచిన ముంపు

ABN , First Publish Date - 2020-10-20T06:00:57+05:30 IST

లంక గ్రామాల ప్రజలను పరుగులు పెట్టించిన కృష్ణమ్మ క్రమక్రమంగా శాంతిస్తుంది. ఆదివారం సాయంత్రం తగ్గిన వరద సోమవారం మధ్యాహ్నం సమయానికి ఎగువ

ముంచిన ముంపు

నీటిలో నాని కుళ్లిపోతున్న పంటలు

లంకల్లో తగ్గుతూ పెరుగుతున్న వరద

5 లక్షల క్యూసెక్కుల పైచిలుకు ప్రవాహం

కొంత పంటనైనా దక్కించుకోవాలని యత్నాలు

పండిపోయిన కంద, పసుపు, తమలపాకు, కూరగాయ పంటలు  


చేతికి అంది వచ్చిన పంటలు.. కృష్ణార్పణమయ్యాయి. అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు పాడైపోయాయి. నాలుగు రోజులుగా నీటిలో నానిన పంటలు కుళ్లిపోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. కుళ్లిన పంటలను చూసిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరద కొంతమేర తగ్గినా ఇంకా ఐదు లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీరు నదిలో ప్రవహిస్తుంది. దీంతో వాణిజ్య పంటలను ముంపు వీడటం లేదు.


లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ముంపునకు గురై మునిగిపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కొంతైనా పంట దక్కకపోతుందా అని పొలాల్లో ఉన్న నీటిని తరలించేందుకు రైతులు మోటార్ల సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది మూడు దఫాలుగా వరద పంటలను ముంచెత్తడంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని రైతులు వాపోతున్నారు.



 కొల్లూరు, రేపల్లె, భట్టిప్రోలు, అక్టోబరు 19: లంక గ్రామాల ప్రజలను పరుగులు పెట్టించిన కృష్ణమ్మ క్రమక్రమంగా శాంతిస్తుంది. ఆదివారం సాయంత్రం తగ్గిన వరద సోమవారం మధ్యాహ్నం సమయానికి ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో మరలా పెరగడం ప్రారంభించింది. తగ్గుతూ పెరుగుతున్న వరద లంక గ్రామాల ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరద ప్రవాహం పోటెత్తడంతో నాలుగు రోజులుగా పంటలు నీటిలో నానిపోయాయి. ముంపునకు గురైన వాణిజ్య పంటలు కుళ్లిపోతున్నాయి.


కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లోని మెరక భూములలో వేసిన పంటలు మాత్రం ప్రస్తుతం బయట పడ్డాయి.  నీరు తగ్గిన అనంతరం ఆయా పంటలు పూర్తిగా కుళ్లిపోయి దర్శనమిస్తున్నాయి. వాటిని చూసిన అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కొంతమంది రైతులు ఇంజన్లు ఏర్పాటు చేసి పొలాల్లోని నీటిని ట్యూబుల ద్వారా నదిలోకి పంపుతున్నారు. కంద, పసుపు, తమలపాకు, కూరగాయ పంటలు పండిపోయాయి. ఇవి ఎందుకూ పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంద కాండం కుళ్లి పోగా, పసుపు, మినుము పంటలు కుళ్ళి దుర్గందాన్ని వెదజల్లుతున్నాయి. కూరగాయ పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయని రైతులు తెలిపారు.


రేపల్లె మండలంలోని రావిఅనంతవరం, పెనుమూడి, మైనేనివారిపాలెం, చాట్రగడ్డ, సింగుపాలెంలో కంద, అరటి, పసుపు వంటి పంటలు దెబ్బతిన్నాయి. మండలంలో సుమారు 1300 ఎకరాలలో వాణిజ్య పంటలు నష్టం జరిగింది. సుమారు 420 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నట్లు సాగుదారులు వాపోతున్నారు. చెరువుల్లో వేసిన రొయ్య పంటంతా వరదపాలైంది.


ఇళ్లకు చేరుతున్న ప్రజలు

వరద తగ్గుతుండడంతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు చిన్నరేవు వద్ద వరద నీటిలో నుంచే ట్రాక్టర్ల ద్వారా లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. మండలంలోని లోతట్టు గ్రామాలైన పెసర్లంక పల్లెపాలెం, ఓలేరు పల్లెపాలెం గ్రామాల్లో వరద నీరు తగ్గుతుండడంతో రోడ్లు బయటపడుతున్నాయి.


గృహాలపైకి చేరిన ప్రజలు ఇళ్లలోకి చేరి బురదను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లోని లోతట్టు గృహాలను వరద నీరు చుట్టుముట్టి ఉంది. పెనుమూడి పల్లెపాలెంలోని 120 నివాస గృహాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. కాలనీలో రెండు అడుగుల మేర నీరు నిలిచి ఉంది. పల్లెపాలెం ప్రజలు పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. 

 


Updated Date - 2020-10-20T06:00:57+05:30 IST