తగ్గిన వైరెస్‌ ఉధృతి

ABN , First Publish Date - 2020-05-09T07:41:06+05:30 IST

10, 11, 14, 18, 20, 26 ఇలా పాజిటివ్‌ కేసులతో నరసరావుపేటను వణికించిన కరోనా వైరస్‌ శాంతించింది.

తగ్గిన వైరెస్‌ ఉధృతి

ఫలితాలు ఇస్తున్న మిషన్‌ మే 15


నరసరావుపేట: 10, 11, 14, 18, 20, 26 ఇలా పాజిటివ్‌ కేసులతో నరసరావుపేటను వణికించిన కరోనా వైరస్‌ శాంతించింది. రెండు రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందటంతో హడలిన అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటి వరకు నరసరావుపేటలో 169 కేసులు నమోదుకాగా ఒక్క వరవకట్టలోనే 128 మంది బాఽధితులు ఉన్నారు. పాజిటివ్‌తో కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 47 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్టు వైద్య అధికారులు తెలిపారు. కరోనా కట్టడికి అమలు చేస్తున్న కట్టు దిట్టమైన వ్యూహంలో భాగంగా నాలుగు రోజులుగా పట్టణంలో పూర్తి  నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు దీనిని కొనసాగించనున్నారు.


కొంత మేర మిషన్‌ మే 15 సత్ఫలితాలను ఇస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలెవ్వరినీ ఇళ్ళల్లో నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఐదు డ్రోన్‌ కెమెరాలతో   పోలీసులు పహారా కాస్తున్నారు. సబ్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు, కమిషనర్‌ కే వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ రమణానాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో రోహిణి, వివిధ శాఖల అధికారులు మిషన్‌ మే 15లో భాగస్వాములై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.


కరోనా పరీక్షల నివేదికలు కూడా పూర్తిగా అందినట్టు వైద్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం 34 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించినట్టు చెప్పారు. ఏఎస్పీ చక్రవర్తి నేతృత్వంలో డీఎస్పీ వీరారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, వంద మందికి పైగా పోలీసు కానిస్టేబుల్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు సంపూర్ణ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. రెండు రోజులుగా కొత్త కేసులు నమోదు కాక పోవటంతో ఇదే పరిస్థితి కొనసాగాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. 

Updated Date - 2020-05-09T07:41:06+05:30 IST