ఎమ్మెల్యే అండతోనే.. దౌర్జన్యం!

ABN , First Publish Date - 2020-08-20T13:29:55+05:30 IST

నగరం నడిబొడ్డున శంకర్‌విలాస్‌ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్స్‌ దుకాణం వ్యవహారంలో..

ఎమ్మెల్యే అండతోనే.. దౌర్జన్యం!

దుకాణం వివాదంతో.. ఎమ్మెల్యే గిరికి హైకోర్టు నోటీసులు

ఆయనతో పాటు సీఐ, తహసీల్దార్‌, మరో ముగ్గురికి కూడా..

బంధువులే తనపై దౌర్జన్యం చేశారని వ్యాపారి ఆరోపణ

రూ.కోటిన్నర విలువ చేసే సామాగ్రి అపహరించారు..

ఎమ్మెల్యే గిరి ఒత్తిడితోనే పోలీసులు పట్టించుకోలేదు..!

విలేకరుల సమావేశంలో వాపోయిన యజమాని


గుంటూరు(ఆంధ్రజ్యోతి): నగరం నడిబొడ్డున శంకర్‌విలాస్‌ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్స్‌ దుకాణం వ్యవహారంలో వ్యాపారికి, అతని బాబాయి కుటుంబానికి మధ్య తలెత్తిన వివాదం చివరకు హైకోర్టుకు చేరింది. బాధితుడు శివప్రసాత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... శంకర్‌విలాస్‌ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్స్‌ వస్త్ర దుకాణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కొప్పురావూరి శివప్రసాద్‌, పైఅంతస్తులో ఒక ఫ్లోర్‌లో శివప్రసాద్‌ బాబాయి ఏడుకొండలు, మరో ఫ్లోర్‌లో మరో బాబాయి బాబూరావు, ఆయన కుమారుడు రమేష్‌ వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. ఏడాదిక్రితం బాబాయి ఏడుకొండలు దుకాణం ఖాళీచేశారు. పై అంతస్తులో బాబూరావు ఏడాది క్రితం దుకాణం ఖాళీ చేసి లక్ష్మీపురంలో దుకాణం ప్రారంభించారు.


అక్కడ యజమానితో తేడాలు రావడంతో దానిని ఖాళీ చేసి జూన్‌ 20న తిరిగి డిబి ఫ్యాషన్స్‌ బిల్డింగ్‌లోని పైఅంతస్తుకు వచ్చారు. అయితే అప్పటి నుంచి దుకాణం ఖాళీ చేయాలని బాబూరావు, ఆయన కుమారుడు రమేష్‌ తనపై ఒత్తిడి తెచ్చారని శివప్రసాద్‌ తెలిపారు. రమేష్‌కు స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి స్నేహితుడు కావడంతో ఆయన ద్వారా అధికార యంత్రాంగాన్ని లోబర్చుకుని ఖాళీ చేయించేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. జూలై 5న ఆదివారం సెలవు కావడంతో దుకాణం తెరవలేదని ఆ రోజు మధ్యాహ్నం తన దుకాణం తాళాలు పగలగొడుతున్నారని స్నేహితులు ఫోన్‌ చేయడంతో అక్కడకు వెళ్ళానన్నారు. అప్పటికే దుకాణానికి ఉన్న తాళాలు పగలకొట్టి వారి తాళాలు వేసుకున్నారన్నారు. తహసీల్దార్‌ మోహనరావు, అరండల్‌పేట సీఐ శ్రీనివాసరావు తదితరుల సమక్షంలో తాళాలు వేసుకున్నట్లు అక్కడ ఉన్న రమేష్‌ స్నేహితులు స్పష్టం చేశారన్నారు. అరండల్‌పేట స్టేషన్‌కు వెళ్ళి సీఐని కలవగా విషయంలో తానేమీ చేయలేనని  చెప్పారన్నారు.


దీంతో జూలై 13న సీఎం, హోం మంత్రి, ఐజీ, అర్బన్‌ ఎస్పీకి కొరియర్‌ ద్వారా ఫిర్యాదు పంపానన్నారు. జూలై 30న షాపు తెరిచారని తెలుసుకొని అక్కడకు వెళ్ళగా అందులో ఉండాల్సిన రూ.కోటి 48 లక్షల ఖరీదైన వస్త్ర సామగ్రి, నగదు, ఫైళ్ళు, డాక్యుమెంట్లు కనిపించలేదన్నారు. తన దుకాణంలో వారి సామగ్రి పెట్టుకొని అమ్ముకుంటున్నారన్నారు. ఈ విషయం బాబూరావును అడిగితే షాపును ఓనర్‌ తమకు ఇచ్చాడన్నారు. దీంతో మళ్లీ అరండల్‌పేట సీఐని కలిస్తే ఆయన   ఫిర్యాదు కూడా తీసుకోలేదన్నారు. దీంతో ఐజీకి కొరియర్‌ ద్వారా ఫిర్యాదు పంపానన్నారు.  ఆగస్టు 3న అర్బన్‌ ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేశానన్నారు. ఫలితం లేకపోవడంతో దీంతో గత్యంతరం లేక ఈ నెల 10న హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో హైకోర్టు బిల్డింగ్‌ యజమాని గురుదత్తు, ఎమ్మెల్యే మద్దాళి గిరి, తహసీల్దార్‌ మోహనరావు, అరండల్‌పేట సీసఐ శ్రీనివాసరావు, బాబూరావు, రమేష్‌లకు నోటీసులు జారీ చేసిందన్నారు. 


Updated Date - 2020-08-20T13:29:55+05:30 IST