అకాల.. కష్టం

ABN , First Publish Date - 2020-04-10T05:30:00+05:30 IST

వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గురువారం డెల్టాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం

అకాల.. కష్టం

వర్షంతో రైతులకు నష్టం

పిడుగుపాటుకు ఇద్దరి మృతి


తెనాలి రూరల్‌,  ఏప్రిల్‌ 9: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గురువారం డెల్టాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పడిన వర్షం రైతులకు తీవ్ర నష్టం, కష్టం మిగిల్చింది. పిడుగులపాటుకు రేపల్లె ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. తెనాలి,  కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని పొలాల్లో రాశులుగా పోసిన మొక్కజొన్న, తెల్లజొన్నలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఇటుకను ప్లాస్టిక్‌ పట్టాలతో కప్పి భద్రపరిచారు. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో ఆరబెట్టిన పసుపు వర్షానికి తడిచింది. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో భారీవర్షానికి ఈదురుగాలులు తోడుకావటంతో మామిడికాయలు నేలరాలాయి.


మొక్కజొన్నకండెలు తడిచి రైతులకు నష్టం జరిగింది. బాపట్ల మండలం కంకటపాలెంలో పిడుగుపడి మన్నె రమేష్‌కు చెందిన రెండెకరాల వరికుప్ప దగ్ధమైంది.  రేపల్లె మండలం గంగడిపాలెంలో కన్నా నరేష్‌(32) నదిలో వేటకు వెళుతున్న సమయంలో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నగరం మండలం పెదపల్లి గొల్లపాలెంలో పిడుగుపాటుకు బెల్లంకొండ లక్ష్మయ్య(74) అనే రైతు మృతి చెందినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌  విజయశ్రీ తెలిపారు. పొలంలో ఉన్న వేరుశనగను కాపాడుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇతడికి కుమార్తె, ఇరువురు కుమారులు ఉన్నారు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో పిడుగు పడి జెట్టి సుబ్బారావుకు చెందిన ఓ గొర్రె మృతిచెందింది.  

Updated Date - 2020-04-10T05:30:00+05:30 IST