మరో వివాదంలో దేవళ్ల రేవతి కుటుంబం

ABN , First Publish Date - 2020-12-12T05:13:27+05:30 IST

రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ చైరపర్సన్‌ దేవళ్ల రేవతి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది.

మరో వివాదంలో దేవళ్ల రేవతి కుటుంబం
దాడి ఘటనను తెలియజేస్తున్న కాంపౌండర్‌ నాగరాజు, కాంపౌండర్‌కు మద్దతుగా ర్యాలీగా వస్తున్న దాచేపల్లి కాపు సంఘం నాయకులు

మొన్న కాజ టోల్‌ప్లాజా సిబ్బందిపై రేవతి దాడి

నిన్న ఆమె మేనల్లుడు ఆస్పత్రి సిబ్బందిపై దౌర్జన్యం


దాచేపల్లి: డిసెంబరు 11: రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ చైరపర్సన్‌ దేవళ్ల రేవతి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. మొన్ననే దేవళ్ల రేవతి గుంటూరు జిల్లాలోని కాజ టోల్‌ప్లాజా వద్ద అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన మరువకముందే తాజాగా దాచేపల్లి నగరపంచాయతీ నారాయణపురంలో ఆమె మేనల్లుడు ఓ ఆస్పత్రి డాక్టర్‌పై దురుసుగా మాట్లాడడమే కాకుండా కాంపౌండర్‌పై దాడికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత ఆసుపత్రి సిబ్బంది పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదుచేశారు. సేకరించిన,  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  

దాచేపల్లి నగర పంచాయతీలోని ఆంజనాపురం కాలనీకి చెందిన బండారు వీరాంజనేయులు కాలికిదెబ్బ తగలడంతో గురువారం సాయంత్రం నారాయణపురంలోని క్రాంతి నర్సింగ్‌ హోంకు తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది  క్షతగాత్రుడికి కుట్లువేసి వైద్యం చేశారు. అనంతరం వెయ్యి రూపాయలు చెల్లించాలని సిబ్బంది బిల్లు అందజేశారు. బిల్లు చెల్లించే విషయంలో క్షతగాత్రుడితోపాటు వెళ్లిన వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి మేనల్లుడు దేవళ్ల వంశీ జోక్యం చేసుకున్నారు. ‘ఇదేమి వైద్యం.. ఇంత బిల్లు వేయడమేంటి’ అంటూ ఆగ్రహాంతో ఊగిపోయి డాక్టర్‌ను దుర్భాషలాడంతో సిబ్బంది డాక్టర్‌కు సపోర్టుగా మాట్లాడారు. తాము అడగ్గానే బిల్లు తగ్గించలేదన్న కోపంతో రెచ్చిపోయిన వంశీ వైద్యసిబ్బందిపైనా దుర్భాషలాడుతూ కాంపౌండర్‌ గంధం నాగరాజుపై దాడిచేశాడు. ఈ ఘటనలో నాగరాజు కింద పడటంతో స్వల్పగాయలయ్యాయి. వైద్యసేవలు పొంది, బిల్లు చెల్లించమంటే, బిల్లు కట్టకుండా, ఇది చాలదన్నట్లు ఆసుపత్రి సిబ్బంది పై దాడిచేయడంతో  కంపౌండర్లు, నర్సులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి ప్రారంభించి 40ఏళ్లు గడిచినా ఇంతవరకు ఇటువంటి ఆఘాయిత్యం జరగలేదని పల్నాడు ప్రాంతంలో సీనియర్‌ వైద్యుడైన కనుమూరి క్రాంతికుమార్‌ పేర్కొన్నారు. 


న్యాయం చేయాలంటూ కాపు సంఘాల ర్యాలీ 

కాంపౌండర్‌ గంధం నాగరాజుపై దేవళ్ల వంశీ దాడిచేయడంపై కాపు సంఘాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా జనసేన నాయకుడు తోట నాగేశ్వరరావు, వైసీపీ నాయకుడు మునగా శ్రీనివాసరావులు మాట్లాడుతూ బతుకుతెరువు కోసం కంపౌండర్‌గా పనిచేస్తున్న నాగరాజుపై దౌర్జన్యం చేయ్యడం ఏమిటిని ప్రశ్నించారు. శుక్రవారం ర్యాలీగా పోలీసుస్టేషన్‌కు వస్తున్న కాపునాయకులతో గురజాల రూరల్‌ సీఐ ఉమేష్‌ మాట్లాడారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధితుడికి న్యాయం చేస్తామని  హామీఇచ్చారు. 

Updated Date - 2020-12-12T05:13:27+05:30 IST