కొత్త బైక్‌ కంటపడితే.. కొట్టేయాల్సిందే

ABN , First Publish Date - 2020-11-27T06:02:53+05:30 IST

కొత్త బైక్‌ కంటపడితే చాలు దాని తీసుకువెళ్లడంతో పాటు ఏటీఎంల వద్ద అమాయకులను బురుడికొట్టిస్తూ నగదు కాజేసి విలాసాలకు పాల్పడుతున్న పవన్‌ తిరుమలేష్‌కు అరండల్‌పేట పోలీసులు చెక్‌ పెట్టారు.

కొత్త బైక్‌ కంటపడితే.. కొట్టేయాల్సిందే
వివరాలు వెల్లడిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

ట్రయల్‌ అంటూ దొంగ బండి ఇచ్చి కొత్త వాహనంతో పరార్‌

నిందితుడు అరెస్టు.. ఆరు ద్విచక్ర వాహనాలు, లక్ష నగదు స్వాధీనం

గుంటూరు, నవంబరు 26: కొత్త బైక్‌ కంటపడితే చాలు దాని తీసుకువెళ్లడంతో పాటు ఏటీఎంల వద్ద అమాయకులను బురుడికొట్టిస్తూ నగదు కాజేసి విలాసాలకు పాల్పడుతున్న పవన్‌ తిరుమలేష్‌కు అరండల్‌పేట పోలీసులు చెక్‌ పెట్టారు. గురువారం అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి నిందితుడి వివరాలు వెల్లడించారు. గుంటూరు ఐపీడీకాలనీ ఆరో లైనుకు చెందిన చాగంటి పవన్‌తిరుమలేష్‌(23) 9వ తరగతి నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించగా కొన్ని కేసులు కొట్టివేశారు. మరి కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి. పవన్‌ కొద్ది రోజులుగా ఎక్కడ బైక్‌ కనిపిస్తే అక్కడ దానిని ఎత్తుకు పోవడం అలవాటు చేసుకున్నాడు. తీసుకెళ్ళిన వాహనంపై మోజు తీరేవరకు షికారు చేసి ఆ తరువాత మరో వాహనం ఎత్తుకెళతాడు. అదెలా అంటే ఏదైనా ప్రదేశంలో కొత్త వాహనంతో ఎవరైనా కనిపిస్తే మీ వాహనం బాగుందే.. నేనూ కొనాలనుకుంటున్నా అంటూ మాటలు కలిపి ఒకసారి ట్రయల్‌ చూస్తానంటూ తన ద్విచక్ర వాహనం అక్కడే వదిలి కొత్త వాహనం తీసుకుని వెళ్ళిపోతాడు. దాని మీద మోజు తీరాక దానిని కూడా అలాగే మరొకరి వద్ద వదిలేసి మరొక వాహనంతో వెళ్ళిపోతాడు. డొంకరోడ్డులో ఓ బైక్‌ తీసుకెళ్ళి అమరావతిరోడ్డులో వదిలాడు. అయితే ఆ వాహనం తాళాలు పోవడంతో దానిని షోరూంకు తీసుకెళ్ళి తాళం తీయమనగా అనుమానం వచ్చిన షోరూం సిబ్బంది ప్రశ్నించడంతో సరైన సమాధానం చెప్పలేక పోయాడు. దీంతో వారు వాహనాన్ని షోరూంలో పెట్టి తాళం తీస్తున్నట్లు చెప్పి కొద్దిరోజుల క్రితం తమ షోరూంలో వాహనం కొన్న యజమానికి సమాచారం అందించి పవన్‌ను ఫొటో తీశారు. దీంతో పవన్‌ అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ ఫొటోను అరండల్‌పేట పోలీసులకు చూపడంతో వారు వెస్ట్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ రమణకుమార్‌ పర్యవేక్షణలో సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎస్‌ రవీంద్ర, హెడ్‌ కానిస్టేబుళ్లు ఖాశీం, శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు పవన్‌కుమార్‌, ఉమామహేశ్వరరావు, ఉస్మాన్‌, మల్లి తదితరులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  అతడి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్ట్‌ చేసిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందించారు.

బాధితుల్లో హైకోర్టు జడ్జి కుమారుడు


పవన్‌ చేతిలో మోసపోయిన ద్విచక్ర వాహనాల యజమానుల్లో హైకోర్టు జడ్జి కుమారుడు కూడా ఉన్నాడు.  విజయవాడలో ట్రయల్‌ చూస్తానంటూ చెప్పి హైదరాబాద్‌కు ఉడాయించాడు. ఆ వాహనంతో నారాయణగూడ పరిధిలో మరొకరిని మస్కా కొట్టాడు. గడచిన రెండు నెలల్లో  పవన్‌ మోసం చేసిన తీసుకువెళ్ళిన ద్విచక్ర వాహనాల విలువ సమారు రూ.20 నుంచి 25 లక్షల వరకు ఉంటుందని అర్బన్‌ ఎస్పీ తెలిపారు. గత అక్టోబరులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన పవన్‌ వివిధ ప్రాంతాల్లో మొత్తం 9 ద్విచక్ర వాహనాలు అపహరించుకుపోయాడు.  

ఏటీఎంల వద్ద రూ.4 లక్షల వరకు బురుడీ


విలాసాలకు అవసరమైన డబ్బును ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను బురుడీ కొట్టిస్తూ పవన్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. ఏటీఎంల వద్ద మాటు వేసి, అమాయకులను గుర్తించి సహాయం చేస్తానని వారి కార్డుకు బదులు తన వద్దనున్న కార్డును ఏటీఎంలో పెట్టి వారు చెప్పిన పిన్‌ నెంబరు ఎంటర్‌ చేస్తాడు. కార్డు మారడంతో నగదు రాదు. దీంతో మీ కార్డు పని చేయడం లేదని చెప్పి పంపి వారు చెప్పిన పిన్‌ నెంబరుతో తరువాత వారి కార్డు నుంచి నగదు డ్రా చేసుకుంటాడు. ఈ విదంగా ఇప్పటి వరకు 13 నేరాలకు పాల్పడి రూ.4 లక్షలు మోసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.  నిందితుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఏటీఎం సెంటర్‌ వద్ద డబ్బు కాజేసినా, వాహనం కొట్టేసినా వెంటనే హైదరాబాద్‌ వెళ్ళి అక్కడ జూనియర్‌ ఆర్టిస్టులతో ఖరీదైన హోటళ్లలో గడపడం అలవాటు ఉందని ఎస్పీ తెలిపారు.


Read more