తీవ్ర లక్షణాలుంటేనే కొవిడ్‌ ఆస్పత్రులకు..

ABN , First Publish Date - 2020-07-22T10:23:19+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ నిఘా,

తీవ్ర లక్షణాలుంటేనే కొవిడ్‌ ఆస్పత్రులకు..

అప్పుడే మరణాలు చోటు చేసుకోకుండా ఉంటాయి

జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌


గుంటూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ నిఘా, నిర్వహణ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో కొవిడ్‌-19 హాస్పిటల్స్‌ నిర్వహణపై నోడల్‌ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ స్థాయిలో గుర్తించిన ట్రై ఏజీ ఆస్పత్రుల్లో పాజిటివ్‌ వ్యక్తులకు సక్రమంగా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు.


స్ర్కీనింగ్‌ పరీక్షల్లో అనుమానిత లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌కి, స్వల్ప లక్షణాలున్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు, తీవ్ర లక్షణాలున్న వారిని జిల్లా కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించాలన్నారు. ట్రై ఏజీ సెంటర్ల నుంచి కొవిడ్‌ ఆస్పత్రులకు వచ్చేవారిని వెంటనే అడ్మిట్‌ చేసుకొని చికిత్స అందించేందుకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్కు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ  విధానం వల్ల ఆస్పత్రులపై అనవసర ఒత్తిడి తగ్గి తీవ్ర లక్షణాలున్న వారికి వెంటనే వైద్య సదుపాయాలు అందించడం ద్వారా మరణాలు సంభవించకుండా చూడొచ్చన్నారు. శాంపిల్స్‌ సేకరణ టీమ్‌లలో దంత వైద్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్‌లోని ట్రైఏజీ సెంటర్లలో అవసరమైన డాక్టర్లను వెంటనే నియమించాలన్నారు.


ఈ సమావేశంలో డీఆర్‌వో ఎన్‌వీవీ సత్యన్నారాయణ, స్పెషల్‌ కలెక్టర్‌ బాబురావు, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమేష్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ అవినాష్‌ పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీ ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 నివారణ ప్రచారరథానికి కలెక్టరేట్‌లో జేసీ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ ఎన్‌జీవో కన్వీనర్‌ బీకే దుర్గపద్మజ, సభ్యులు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-22T10:23:19+05:30 IST