నెల దాటినా.. నెరవేరలేదు..!

ABN , First Publish Date - 2020-09-25T14:24:02+05:30 IST

కరోనా కేసులు పెరిగిపోతున్నందున పల్నాడువాసుల కోసం నరసరావుపేటలో..

నెల దాటినా..  నెరవేరలేదు..!

నరసరావుపేటలో కొవిడ్‌ ఆస్పత్రి.. ఎప్పటికో? 

ప్రారంభంతో సరిపెట్టిన పాలకులు

సా..గుతున్న పనులు

కరోనా అత్యవసరాన్ని పరిగణనలోకి తీసుకోని అధికారులు


నరసరావుపేట(గుంటూరు): కరోనా కేసులు పెరిగిపోతున్నందున పల్నాడువాసుల కోసం నరసరావుపేటలో కొవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. గత నెల 17న అట్టహాసంగా ఆస్పత్రిని ప్రారంభించారు. ఇంకేం కరోనా చికిత్స కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.. మనకు అందుబాటులో వైద్యశాల వచ్చేసిందని జనం భావించారు. అయితే వారి ఆశలు నెలదాటినా నెరవేరలేదు. ఈ ఆస్పత్రిలో పనులు నెలల తరబడి సాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన జరగాల్సి పనులు సైతం నత్తనడకన సాగతీస్తున్నారు. ఈ పనులు జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో వినియోగంలోకి వచ్చే పరిస్థితులు కానరావడంలేదు. గత నెల 17న ఆస్పత్రిని ప్రారంభించిన పాలకులు చేతులు దులుపుకొన్నారు. పడకలను సిద్ధం చేసి ఆక్సిజన్‌ సరఫరా పనులు చేశారు. అయితే ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. డ్రెయినేజి పనుల్లో లోపాలు ఉన్నట్టు సమాచారం. వైద్యసేవలకు అవసరమైన పరికరాలు, ఫర్నీచర్‌ ఇంకా ఏర్పాటు చేయలేదు. 


ప్రతిపాదనల్లోనే సిబ్బంది నియామకాలు 

కొవిడ్‌ బాధితులు ఆస్పత్రులలో బెడ్లు దొరక్క, ప్రైవేట్‌ ఆస్పత్రులలో బిల్లులు భరించలేక పేదలు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఈ ఆస్పత్రిని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు పూర్తి చేసినా బాధితులకు చికిత్సలు అందించే వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. ఒక వేళ పనులు ఈ నెలాఖరకు పూర్తయినా వెంటనే ఆస్పత్రిని వినియోగంలోకి తెచ్చే పరిస్థితి లేదు. ఆక్సిజన్‌ వసతి గల 130 పడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రకారం ఇక్కడ 10 మంది డాక్టర్లు, 40 మంది వరకు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, పారిశుధ్య సిబ్బంది తదితరులను నియమించాలి. వీరి నియామకంపై ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2020-09-25T14:24:02+05:30 IST