మళ్లీ పెరుగుతోన్న.. కరోనా

ABN , First Publish Date - 2020-12-29T05:49:04+05:30 IST

కొద్ది రోజుల నుంచి కరోనా వైరస్‌ దాదాపుగా అదుపులోకి వచ్చింది అనుకుంటుండగా తాజాగా మళ్లీ కోరలు చాస్తోన్నది.

మళ్లీ పెరుగుతోన్న.. కరోనా

యూకే రిటర్న్‌ల్లో నలుగురికి పాజిటివ్‌

వారి సంబంధీకులు ఎనిమిది మందికి వైరస్‌

జిల్లాలో కొత్తగా మరో 53 మందికి పాజిటివ్‌


గుంటూరు, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): కొద్ది రోజుల నుంచి కరోనా వైరస్‌ దాదాపుగా అదుపులోకి వచ్చింది అనుకుంటుండగా తాజాగా మళ్లీ కోరలు చాస్తోన్నది. జిల్లాను బ్రిటన్‌ భయం వెంటాడుతోంది. ఇప్పటికే నలు గురికి పాజిటివ్‌ రాగా.. వారి కాంటాక్ట్‌లో ఎనిమిది మందికి కూడా కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయింది. యూనైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) నుంచి జిల్లాకు వచ్చిన 264 మందిలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. వారిని కొవిడ్‌-19 ఆస్పత్రులకు తరలించి చికిత్స ప్రారం భించారు. అలానే వీరి శాంపిల్స్‌ రిపోర్టులను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వారిని కాంటాక్ట్‌ అయిన వారిలో 8 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కొంత ఆందోళన నెలకొన్నది. ఇందుకు కారణం యూకేలో కరోనా కొత్త రూపు స్ట్రెయిన్‌ విజృంభిస్తోండటమే. ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చి పాజిటివ్‌గా టెస్టింగ్‌ అయిన వారికి స్ట్రెయిన్‌ సోకకుండా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.


పెరిగిన పాజిటివ్‌ శాతం

పాజిటివ్‌ శాతం ఒకటి కంటే తక్కువగా నమోదు అవుతూ ఉండింది. అయితే సోమవారం వచ్చిన ఫలితాల్లో ఆ శాతం పెరిగింది. మొత్తం 4,160 శాంపిల్స్‌ ఫలితాల్లో 53(1.27 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగతా 4,107(98.73 శాతం) నెగిటివ్‌ వచ్చింది. కొత్తగా గుంటూరు నగరంలో 13, తాడేపల్లి మునిసిపాలిటీలో 11, పిడుగురాళ్ల మునిసిపాలిటీలో 4, తెనాలిలో 2, వినుకొండ, చిలకలూరిపేటలో ఒక్కో కేసు నమోదైంది. అలానే తెనాలి రూరల్‌లో 4, కారంపూడిలో 3, మంగళగిరిలో 3, కాకుమానులో 2, అమరావతి, మాచర్ల, నూజెండ్ల, పెదకాకాని, పెదనందిపాడు, పొన్నూరు రూరల్‌, ప్రత్తిపాడు, రాజుపాలెం, వట్టిచెరుకూరులో ఒక్కో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 76,238కి పెరిగింది. వారిలో 75 వేల మంది డిశ్చార్జి కాగా ప్రస్తుతం 511 మంది చికిత్స పొందుతున్నారు. 727 మంది చనిపోయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-29T05:49:04+05:30 IST