అయ్యో పాపం.. కన్నతండ్రే అత్యాచారం.. చికిత్స కోసం ఆస్పత్రికెళ్తే కరోనా సోకడంతో..

ABN , First Publish Date - 2020-06-26T14:53:55+05:30 IST

ఆ చిన్నారికి దురదృష్టం వెంటాడుతోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమెపై అత్యాచారం చేశాడు. చికిత్స పొందేందుకు గుంటూరు జీజీహెచ్‌కి రాగా.. కరోనా ఆమె పాలిట శాపంగా మారింది.

అయ్యో పాపం.. కన్నతండ్రే అత్యాచారం.. చికిత్స కోసం ఆస్పత్రికెళ్తే కరోనా సోకడంతో..

విధివంచితులు.. కరోనా బారిన అత్యాచార బాధిత బాలిక

జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా వైరస్‌

తోడుగా ఉన్న తల్లికి కూడా..

కరోనా బాధితుల మధ్య ఉంచడంతోనే వైరస్‌ వ్యాప్తి 

ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి


గుంటూరు (సంగడిగుంట) : ఆ చిన్నారికి దురదృష్టం వెంటాడుతోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమెపై అత్యాచారం చేశాడు. చికిత్స పొందేందుకు గుంటూరు జీజీహెచ్‌కి రాగా.. కరోనా ఆమె పాలిట శాపంగా మారింది. తోడుగా ఉన్న తల్లికి కూడా రిపోర్టు వచ్చింది. చేయని తప్పునకు శిక్షను అనుభవిస్తున్న వారి పరిస్థితి ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పిస్తోంది. 


 గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఓ కుటుంబం పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 7వ తేదీన తల్లీ కూతుళ్లు నిద్రిస్తున్నారు. మద్యం సేవించి వచ్చిన తండ్రి ఆ మత్తులోనే 15 సంవత్సరాల కుమార్తెపై అత్యాచారం చేశాడు. మెలుకువ వచ్చి అడ్డువచ్చిన తల్లిని కొట్టాడు.  మరుసటిరోజు తల్లీకుమార్తెలు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు పొదిలి ప్రసాద్‌ బ్లాక్‌లోని రెండవ అంతస్థులో గల జనరల్‌ మెడిసెన్‌ మహిళలకు చికిత్సను అందిస్తున్న వార్డులో చికిత్సను అందించారు. చిన్నారికి ఆరోగ్యం కుదుటపడ్డాక ఈ నెల 22న ఉదయం 11 గంటలకు కరోనా పరిక్ష నిర్యహించారు. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు ఫలితాలు ఆసుపత్రికి వచ్చాయి. భాధితురాలికి, ఆమె తల్లికి పాజిటివ్‌ అని వచ్చింది. కానీ ఇవేమీ పట్టని ఆ వార్డు సిబ్బంది వారిని 11 గంటలకు డిశ్చార్జి చేశారు.


దాంతో తల్లీకుమార్తెలు అక్కడినుంచి ఆసుపత్రి ఆవరణలోనే గల సఖి కేంద్రానికి చేరుకున్నారు. అత్యాచార బాధితులకు అందే ప్రభుత్వ సహాయంపై సలహాలడిగారు. వారికి సలహాలిచ్చిన సలహాదారు విజయలక్ష్మి అదే విషయాన్ని పెదనందిపాడు మహిళా కానిస్టేబుల్‌కు చెప్పింది. అప్పటికే వీరి పాజిటివ్‌ వీరి కంటే ముందుగా సమాచారం స్టేషన్‌కు చేరింది. దీనితో ఆమె సఖి కేంద్రంలోని వారికి సమాచారం ఇచ్చింది. అప్పటికే వారితో మట్లాడుతున్న ఆమె అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చి వారి సహాయంతో కరోనా వార్డులో చేర్పించింది. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వీరికి ఆసుపత్రిలోను కరోనా సోకింది అనే విషయంలో సందేహం లేదు.


ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి 

 ఈనెల 21 ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో జనరల్‌ వార్దులో కరోనా రోగి వార్త ప్రచురించింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత అదే వార్డులో చికిత్స పొందిన వారు కరోనా బారిన పడ్డారు. కరోనా అనుమానితులను అందరి మధ్యనే ఉంచడంతో ఈ పరిస్థితి వస్తోంది. ఇంకా ఎందరు ఇలా కరోనా బారన పడుతున్నారో తెలియడంలేదు. ఇప్పటికైనా జీజీహెచ్‌ అధికారులు కరోనా అనుమానితుల విషయంలో స్పష్టత లేకపోతే జీజీహెచ్‌కు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - 2020-06-26T14:53:55+05:30 IST