కోరలు చాస్తున్న కరోనా.. గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇదీ..!
ABN , First Publish Date - 2020-04-25T16:05:47+05:30 IST
మహమ్మారిలా కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తితో అటు ప్రభుత్వ యంత్రాంగం.. ఇటు ప్రజలు వణికిపోతున్నారు. మూడు నాలుగు రోజులు గా పాజిటివ్ బాధితుల సంఖ్య ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోతోంది

మహమ్మారిలా.. కోరలు చాస్తోన్న కరోనా
11 పాజిటివ్ కేసులు నమోదు
నరసరావుపేటలో మరో తొమ్మిది మందికి
అల్లూరివారిపాలెం, కొప్పునూరుల్లోనూ కరోనా
గుంటూరు జిల్లాలో 206కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): మహమ్మారిలా కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తితో అటు ప్రభుత్వ యంత్రాంగం.. ఇటు ప్రజలు వణికిపోతున్నారు. మూడు నాలుగు రోజులు గా పాజిటివ్ బాధితుల సంఖ్య ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య ఉహించని రీతిలో పెరుగుతున్నది. బుధవారం 19 కేసులు, గురువారం 18 కేసులు నమోదుకాగా శుక్రవారం 11 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో జిల్లాలో ఈ కరోనా బాధితుల సంఖ్య 206కి చేరింది. వీరిలో 8 మంది చని పోగా, 23 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన 11 కేసుల్లో నరసరావుపేట ప్రాంతానికి చెందిన వారే తొమ్మిది మంది ఉన్నారు. మరో కేసు మాచర్ల ప్రాంతానికి చెందినది. గుంటూరు సమీపంలోని గోరంట్లలో ఓ కేసు నమోదైంది.
ఈ 11 మందిలో ఐదుగురు మహిళలే కాగా వారిలో 13 ఏళ్ళ బాలిక ఒకరున్నారు. మాచర్ల మండలం కొప్పునూరు లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే సదరు ఆసుపత్రిలో డాక్టర్‌కు కరోనా పాజిటివ్ తేలడంతో కొప్పునూరుకు చెందిన వ్యక్తిని, మరో ఐదుగురిని స్థానిక అధికారులు మంగళవారం క్వారెంటైన్‌కు తరలించారు. వీరి రక్త నమూ నాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా చికిత్స పొందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. అతడ్ని గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐకు తరలించారు. సదరు వ్యక్తి కుటుంబసభ్యులు ఎనిమిది మందిని గుంటూరులోని కాటూరు వైద్యశాల లోని క్వారంటైన్‌కు తరలించారు. మరో 22 మందిని మాచర్ల మండలంలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారెంటైన్‌లో ఉంచారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి బంధువులైన 14 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు పీహెచ్‌సీ డాక్టర్ హుస్యానాయక్ చెప్పారు. శనివారం వారికి శ్వాప్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలానికి 10 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రాగా ముగ్గురికి పరీక్ష చేయడంతో రిపోర్డు నెగెటివ్‌గా వచ్చిందన్నారు. తుమృకోట గ్రామంలో కరోనా టెస్ట్‌కు సంబంధించి 14 మంది నివేదికలు నెగెటివ్‌గా వచ్చాయి. వీరిలో 9 మందిని మిట్టగుడిపాడులోని కేజీ బీవీ క్వారంటైన్‌లో ఉంచగా మిగతా వారిని హోం క్యారంటైన్‌లో ఉంచారు.
చెక్‌పోస్టును తనిఖీ చేసిన రూరల్ ఎస్పీ
ఆంధ్ర, తెలంగాణ ప్రాంత సరిహద్దు చెక్ పోస్టును జిల్లా ఎస్పీ విజయరావు శుక్రవారం తనిఖీ చేశారు. మాచర్ల మండల పరిధిలోని కొప్పునూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు తో ఆయన ఇక్కడకు వచ్చారు. నూతన బ్రిడ్జికి ఇరువైపులా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పోలీసుల పనితీరును పరిశీలించి సూచనలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు శానిటైజర్స్, మాస్క్‌లు, కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ ప్రసాద్, గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, విజయ పురిసౌత్ ఎస్‌ఐ పాల్ రవీందర్ ఉన్నారు.