కరోనా.. విజృంభణ
ABN , First Publish Date - 2020-04-21T07:00:33+05:30 IST
నరసరావుపేటలో కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభిస్తున్నది. సోమవారం ఒకే రోజు 21 కేసులు నమోదు అవ్వడంతో పట్టణవాసులు...

- నరసరావుపేటలో వైరస్ కల్లోలం
- ఒకే రోజు 21 కరోనా పాజిటివ్ కేసులు
- పట్టణంలో 29కి చేరిన బాధితుల సంఖ్య
- క్వారంటైన్ కేంద్రాలకు 74 మంది తరలింపు
- ప్రజల్లో ఆందోళన.. అప్రమత్తమైన యంత్రాంగం
నరసరావుపేట, ఏప్రిల్ 20: నరసరావుపేటలో కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభిస్తున్నది. సోమవారం ఒకే రోజు 21 కేసులు నమోదు అవ్వడంతో పట్టణవాసులు హడలిపోతున్నారు. సోమవారానికి కేసుల సంఖ్య 29కి చేరింది. ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ప్రతి ఒక్కరికి దడ పుట్టిస్తున్నది. పాజిటివ్ బాధితులకు సంబంధించి కాంటాక్ట్ వ్యక్తులు 74 మందిని గుర్తించారు. వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు శాంపిల్స్ సేకరించారు. పట్టణంలో కరోనా తొలి కేసు, తొలి మరణం ఈ నెల 9న నమోదైంది. 10 రోజుల్లోనే ఈ సంఖ్య 29కి చేరడం ప్రమాదక స్థాయిని తెలియజేస్తున్నది. తొలి కేసు నమోదైన వరవకట్ట ప్రాంతంలో కరోనా విజృంభిస్తున్నది. అక్కడి నుంచి రామిరెడ్డిపేట, ఎన్‌జీవో కాలనీ, పల్నాడు రోడ్డులకు కేసులు విస్తరించాయి. రామిరెడ్డిపేటలో రెండు, ఎప్‌జీవో కాలనీలో ఒకటి, పల్నాడు రోడ్డులోని ప్రముఖ వైద్యశాలలో నాలుగు కేసులు నమోదయ్యాయి. వరవకట్టకు చెందిన హోం గార్డు ఈ వైద్యశాలలో చికిత్స పొందాడు. ఇతడికి కరోనా అని తెలియక ఈ ఆస్పత్రిలో చికిత్స అందించారు. హోం గార్డుకు పాజిటివ్ రావడంతో ఈ వైద్యశాలకు చెందిన వైద్యులు, సిబ్బంది దాదాపు 30 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా ఓ వైద్యురాలి సహా నలుగురికి పాజిటివ్ నమోదైంది. ఎన్‌జీవో కాలనీలో ప్రభుత్వ ఉద్యోగినికి పాజిటివ్ రాగా రామిరెడ్డిపేటలో కేబుల్ బిల్లు పాజటివ్‌తో మృతి చెందిన వ్యక్తికి గత నెలలో చెల్లించగా ఈమెకు పాజిటివ్ వచ్చింది. ఇదే పేటలో ప్రభుత్వ ఉద్యోగిని భర్తకు పాజిటివ్ నమోదైంది. వరవకట్టలో మృతుడు, అతడి కుటుంబ సభ్యులు, హోంగార్డు, అతడి కుటుంబ సభ్యుల ద్వారా 13 మందికి కరోనా సోకిందని అధికారులు నిర్ధారించారు. వరవకట్టలో కరోనా తొలి కేసు మర్కజ్ వెళ్ళి వచ్చిన వ్యక్తి ద్వారానే నమోదు అయ్యి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో హోంగార్డు చికిత్స పొందిన పక్క బెడ్డులో చికిత్స పొందిన పనస తోటకు చెందిన మహిళకు పాజిటివ్‌గా నమోదైంది.
రెడ్ అలర్ట్
కరోనా కేసుల సంఖ్య 29కి పెరగడంతో పట్టణంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరవకట్ట, అరండల్‌పేట, పల్నాడురోడ్డు, రామిరెడ్డిపేటలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలలో రహదారులకు బారికేడ్డు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ఎన్‌జీవో కాలనీవాసులను అప్రమత్తం చేశారు. అయా ప్రాంతాలలో పురపాలక సంఘం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. పట్టణానికి ఉన్న ప్రధాన రహదారులను పోలీసు శాఖ దిగ్బంధం చేసింది. పట్ణణానికి ఉన్న డొంక రోడ్డులకు కందకాలు తవ్వారు.
స్వీయ నియంత్రణే ఉత్తమం
కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. వ్యక్తి గత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడంతో పాటు, స్వీయ గృహా నిర్బంధం ఆచరించాలి. కరోనా ముందస్తు చర్యలను ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ బీ శివారెడ్డి, డీఎస్పీ వీరారెడ్డి, తహసీల్డార్ రమణ నాయక్ పర్యవేక్షిస్తున్నారు.
క్వారంటైన్‌కు తుమృకోటకు చెందిన 11 మంది
రెంటచింతల: నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యురాలికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె వద్ద చికిత్స పొందిన తుమృకోట గ్రామానికి చెందిన 11 మందిని క్వారెంటైన్‌కు తరలించినట్లు డాక్టర్ హుస్యానాయక్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు. గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు గాయపడి వైద్యురాలి వద్ద చికిత్స పొందారు. అయితే సదరు మహిళా డాక్టర్‌కు పాజిటివ్‌తో అధికారులు సోమవారం అప్రమత్తమయ్యారు. ఉదయాన్నే తుమృకోట గ్రామానికి చేరుకుని తొమ్మిది మందిని మిట్టగుడిపాడులోని కేజీబీవీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మంచానికే పరిమితమైన మరో ఇద్దర్ని హోం ఐసోలేషన్‌లో ఉంచారు.
సెకండరీ కాంటాక్టులకు వైద్య పరీక్షలు
దాచేపల్లి: దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో రెడ్‌జోన్ పరిధిలో నివాసం ఉన్న సెకండరీ కాంట్రాక్టులు 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం నారాయణపురం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తహసీల్దార్ గర్నేపూడి లెవీ తెలిపారు.