కట్టడి ఉన్నా.. రెట్టింపు .. జూలైలో కరోనా కేసుల పెరుగుదల

ABN , First Publish Date - 2020-08-01T14:40:52+05:30 IST

అన్‌లాక్‌ 2.0లో లాక్‌డౌన్‌ తరహా నిబంధనలను జిల్లావ్యాప్తంగా అమలు చేసినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఒక్క జూలై నెలలోనే డీఎంహెచ్‌వో కార్యాలయం ప్రకటించిన లెక్కల ప్రకారం జిల్లాలో 13,489 కేసులు నమోదయ్యాయి.

కట్టడి ఉన్నా.. రెట్టింపు .. జూలైలో కరోనా కేసుల పెరుగుదల

ఈ నెలలోనే జిల్లాలో 13,489 కేసులు నమోదు

లోపం గుర్తించలేకపోతున్న జిల్లా యంత్రాంగం


గుంటూరు (ఆంధ్రజ్యోతి): అన్‌లాక్‌ 2.0లో లాక్‌డౌన్‌ తరహా నిబంధనలను జిల్లావ్యాప్తంగా అమలు చేసినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఒక్క జూలై నెలలోనే డీఎంహెచ్‌వో కార్యాలయం ప్రకటించిన లెక్కల ప్రకారం జిల్లాలో 13,489 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో కరోనాకి కట్టడి చేసే నాథుడే కరువయ్యాడు. నిత్యం 360కి ఏమాత్రం తగ్గకుండా పాజిటివ్‌ కేసులు వస్తుండటం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. నిత్యం వెయ్యి వరకు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నా లోపాన్ని అధికారులు పసిగట్టలేకపోతోన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేస్తే 28 రోజుల్లో అక్కడ కేసుల ఉద్ధృతి తగ్గాలి. అలాంటిది జిల్లాలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఏటీ అగ్రహారం కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రారంభమై నాలుగు వారాలు అవుతున్నా అక్కడ వైరస్‌ ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 74 మందికి పాజిటివ్‌ వచ్చిందంటే అక్కడ పరిస్థితిని అంచనా వేయొచ్చు. 


మరోవైపు బ్రాడీపేటలో కంటైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసి 28 రోజులు పూర్తి కాగా ఇంకా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గుంటూరు నగరంలో కేసులు పెరగడానికి జనం గుంపులు, గుంపులుగా ఉదయం నిత్యవసర సరుకుల కొనుగోళ్లకు వస్తోండటం కూడా ఒక కారణంగా మారింది. ఉదయం 11 గంటల వరకే షాపులు అందుబాటులో ఉంటుండటంతో ఆ సమయంలో వందల, వేల సంఖ్యలో ప్రజలు షాపుల వద్దకు వస్తున్నారు.  ఉదయం పూట తెనాలి పట్టణం, గుంటూరు నగరంలోని లాలాపేట, కొత్తపేట, డొంకరోడ్డు, ఏలూరుబజారు, పట్నంబజార్‌, ఏటుకూరు రోడ్డు ప్రాంతాలు పూర్తి జనసంద్రంగా మారిపోంన్నాయి. దీంతో వైరస్‌ వ్యాప్తికి ఆయా ప్రదేశాలు హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. ఇక కరోనా పరీక్షలు జరిగే ప్రదేశాల్లో కూడా ఏమాత్రం సామాజిక దూరం పాటించడం లేదు. సహజంగా అనుమానిత లక్షణాలు ఉన్న వారు టెస్టుల కోసం వస్తున్నారు. కొందరు ముందుజాగ్రత్తగా టెస్టింగ్‌ చేసుకొంటున్నారు. సామాజిక దూరం పాటించకపోతుండటం వలన కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. అలానే జిల్లాలో మద్యం దుకాణాల వద్ద కూడా కనీస భౌతికదూరం పాటించడం లేదు. అవి కూడా వైరస్‌ వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయి. 

Updated Date - 2020-08-01T14:40:52+05:30 IST