న్యాయమడిగితే కేసులా?
ABN , First Publish Date - 2020-04-25T10:05:53+05:30 IST
తమతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయం చేయమని అడిగితే..

ఆంక్షలతో ఉద్యమం ఆపలేరు
129వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, తుళ్లూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): తమతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయం చేయమని అడిగితే.. మాపై కేసులు పెడతారా అంటూ అమరావతి ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే సాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 129వ రోజుకు చేరాయి. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం కూడా అందించేందుకు వెళ్లినా దళిత జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. తుళ్లూరుకు చెందిన మేరిగ మరియదాసు అంబేద్కర్ చిత్రపటంతో తన నివాసంలో దీక్ష చేపట్టారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాని డిమాండ్ చేస్తూ రాజధాని పెదపరిమి, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, వెలగపూడి, రాయపూడి, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నీరుకొండ, తదితర గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు తమ నివాసాలోనే వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. వారికి మద్దతుగా పొన్నెకల్లులో వరుసగా శుక్రవారం ఆరవ రోజు నిరసన దీక్షలు చేపట్టారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా అమరావతి అన్ని గ్రామాల్లో రాత్రి 7.30 గంటల నుంచి 5 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి రైతులు, మహిళలు తమ నిరసన తెలియజేశారు.