అడ్డంకులతో.. ఆపలేరు

ABN , First Publish Date - 2020-04-24T09:24:08+05:30 IST

అడుగడుగునా ఆంక్షలతో భయబ్రాంతులకు గురి చేసి ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని అమరావతి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుంచే పాలన సాగాలని డిమాండ్‌

అడ్డంకులతో.. ఆపలేరు

అరెస్టులతో భయబ్రాంతులు

ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని ధ్వజం 

128వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ, గుంటూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): అడుగడుగునా ఆంక్షలతో భయబ్రాంతులకు గురి చేసి ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని అమరావతి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుంచే పాలన సాగాలని డిమాండ్‌ చేస్తూ గురువారం 128వ రోజు నిరసనలు కొనసాగించారు. పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, నీరుకొండ, కురగల్లు తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి. గురువారం రాత్రి అమరావతి వెలుగు నిర్వహించారు.  


జేఏసీ నేత అరెస్టు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రసాదించిన ప్రాథమిక హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందంటూ తుళ్లూరులో అంబేద్కర్‌ విగ్రహాన్ని నీటితో కడిగి నిరసన తెలిపేందుకు యత్నించిన అమరావతి పరిరక్షణ దళిత జేఏసీ నేత చిలక బసవయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అధికార పార్టీ నేతలకు వర్తించవా అని ప్రశ్నించారు.


పొన్నెకల్లులో ఐదో రోజు.. 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులు, మహిళలకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లులో ముప్పాళ్ల సాంబశివరావు నివాసంలో ఐదో రోజూ రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ గ్రామ కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-24T09:24:08+05:30 IST