రాజ్యాంగమే మాకు రక్ష
ABN , First Publish Date - 2020-05-24T08:06:49+05:30 IST
అన్ని కులాలు, మతాలకు చెందిన రైతులం రాజధానికి భూములిచ్చాం.. పార్టీలు, రాజకీయ కక్షలు మాపైన ..

158వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, తుళ్లూరు, తాడికొండ, మే 23(ఆంధ్రజ్యోతి): అన్ని కులాలు, మతాలకు చెందిన రైతులం రాజధానికి భూములిచ్చాం.. పార్టీలు, రాజకీయ కక్షలు మాపైన రుద్దకండి.. అంటూ అమరావతి ప్రాంత రైతులు వేడుకొన్నారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకోకుండా ఓ పార్టీపైన ఉన్న దురభిమానంతో మాపై సోషల్ మీడియా వేదికగా కొందరు నానా మాటలు అంటున్నారు... ఒక్కసారి ఇక్కడికి వచ్చి మా పరిస్థితులు చూసి మాట్లాడండి.. అని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమకు రక్షన్నారు. పాలనంతా అమరావతి నుండే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 158వ రోజుకు చేరాయి. తమ గురించి వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. లాక్‌డౌన్ నిబందనలకు లోబడి ఎవరి ఇంట్లోవారే ఉంటూ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శలను నిర్వహించారు. తుళ్లూరు, మందడం, రాయపూడి, అనంతవరం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, పెదపరిమి తదితర 29 గ్రామాల రైతులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు.
ఊపిరున్నంతవరకు గాంధేయమార్గంలో పోరు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఎన్నాళ్లయినా పోరు ఆపేది లేదని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో దళితులను సీఎం జగన్ నమ్మించి మోసం చేశారంటూ దళిత జేఏసీ నేతలు ఆరోపించారు. హైకోర్టు లేకపోతే మా పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు ధన్యవాదాలంటూ తుళ్లూరులో జేఏసీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అలానే అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు విద్యుత్ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి మహిళలు, రైతులు సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.