చెక్కు మతలబు ఏమిటో!

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

జిల్లా మలేరియా విభాగంలో ఓ పేమెంట్‌కు సంబంధించి చెక్కు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చెక్కు మతలబు ఏమిటో!

సంతకం విషయంలోనే కలెక్టర్‌, డీఎంవోకు వాగ్వాదం

సీజనల్‌ వ్యాధులపై ఓ షార్ట్‌ ఫిలిం?

రూ.11 లక్షలకు బిల్లు..

ఆ ఫిలిం రూపకల్పనకు అనుమతి ఇచ్చిందెవరో?

విజిలెన్స్‌ చొరవ తీసుకొంటేనే వాస్తవాలు వెలుగులోకి..


గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా మలేరియా విభాగంలో ఓ పేమెంట్‌కు సంబంధించి చెక్కు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  చెక్కుపై సంతకం చేసే విషయంలో జిల్లా మలేరియా అధికారి నిరాకరించడం, దానిపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో పెద్ద వివాదం రేగిన విషయం తెలిసిందే. చివరికి డీఎంవో సరెండర్‌కు దారి తీయగా ఆమె హైకోర్టుని ఆశ్రయించి సరెండర్‌ ఉత్తర్వులను సస్పెన్షన్‌ చేయించి తిరిగి విధుల్లోకి చేరారు. ఈ నేపథ్యంలో శనివారం దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన అనుమతులు తీసుకోకుండానే సీజనల్‌ వ్యాధులపై ఒక షార్టు ఫిలిం రూపొందించినట్లు సమాచారం. దానికి సంబంధించి రూ.11 లక్షలకు బిల్లు పెట్టినట్లు తెలిసింది. మలేరియా అధికారి వద్ద నిధులు ఉండటంతో ఫైలు ఆమె వద్దకు వెళ్లింది. తన కార్యాలయం నుంచి ఫైలు ప్రాసెస్‌ కాకుండా చెక్కుపై సంతకం చేయాల్సిందిగా తొలుత డీఎంహెచ్‌వో నుంచి ఆదేశాలు రావడం, వాటిని ఆమె తిరస్కరించడం జరిగినట్లు భోగట్టా. దాంతో ఈ వ్యవహారం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ దృష్టికి వెళ్లింది. ఆయన ఆ చెక్కుపై సంతకం పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మలేరియా అధికారి సంతకం చేయకుండా తన వాదనని వినిపించేందుకు కలెక్టర్‌ వద్దకు వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఆమెని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే రూ.10 లక్షల దాటే పనులకు సంబంధిత విభాగాధిపతులే పరిపాలన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లు చెల్లింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగకపోతే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటింగ్‌ జనరల్‌ పట్టుకొని తలంటుతుంది. అంతేకాకుండా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపుతుంది. వాటిపై సంబంధిత అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారులు జిల్లా మలేరియా కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి ఫైలు తెప్పించుకొని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. 


డీఎంవోగా జ్ఞానశ్రీ బాధ్యతల స్వీకారం

 జిల్లా మలేరియా అధికారిగా అల్లాడి జ్ఞానశ్రీ తిరిగి బాధ్యతలు చేపట్టారు.  శనివారం ఉదయం జ్ఞానశ్రీ హైకోర్టు ఆర్డర్‌ కాపీతో వచ్చి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో తిరిగి డీఎంవోగా బాధ్యతలు స్వీకరించారు. తన జాయినింగ్‌ రిపోర్టుని ఆమె డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌కు పంపారు.  

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST