సొమ్మొకరిది!... సోకు సివిల్ సప్లైస్‌ది..
ABN , First Publish Date - 2020-12-14T05:02:55+05:30 IST
ఇటీవల విరుచుకుపడిన నివర్ తుపాను దెబ్బకు ఖరీఫ్ రైతు కుదేలయ్యాడు. కోతకొచ్చిన వరి చేలు పూర్తి గా నేల మట్టమయ్యాయి.

రైతు చెల్లింపులకోసం ఎఫ్‌సీఐని అడ్డుపెట్టుకోవాలనే ఆలోచన
అప్పుల్లో ఉన్నా నిధులువిడుదల చేయని ప్రభుత్వం
ధాన్యం కొనాలంటూ ఆదేశాలు
రైతులకు ఇవ్వటానికి డబ్బులేక అవస్థలు
గందరగోళం మధ్య మిల్లర్లు వెనకడుగు
జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి అగమ్యగోచరమయింది. డబ్బులేని శాఖ ధాన్యం కొనటానికి సిద్ధమైతే, డబ్బిచ్చే కేంద్ర ప్రభుత్వ శాఖకు నాసిరకం ధాన్యం అడ్డంకిగా మారింది. వీటన్నిటినీ సమన్వయ పరచుకుని, పెద్దన్న పాత్రలో ఆర్థిక ఇబ్బందుల ను అధికమించేలా స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోలు ఉత్తర్వులు జారీ చేసేశాం.. మా పనైపోయింది... అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇన్ని చిక్కులతో నివర్ బాధిత రైతు పరిస్థితి దారుణంగా తయారయింది.
తెనాలి, డిసెంబరు 13, (ఆంధ్రజ్యోతి): ఇటీవల విరుచుకుపడిన నివర్ తుపాను దెబ్బకు ఖరీఫ్ రైతు కుదేలయ్యాడు. కోతకొచ్చిన వరి చేలు పూర్తి గా నేల మట్టమయ్యాయి. చాపలా పరుచుకున్న వరి కంకుల నంచి మొలకలొస్తే, కోతకోసిన ఓదెలు వాన నీటి లో తేలియాడాయి. రైతులు ఎక్కడా అధైర్య పడాల్సి న పనిలేదని, మిమ్ముల్ని పూర్తిగా ఆదుకుంటామని, రంగుమారినా, మొలకలొచ్చినా ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి మేమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు రైతులకు ధైర్యం చెప్పారు. అన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. ఇవన్నీ జరిగినంత వేగంగా రైతుల నుంచి ధాన్యం మాత్రం కొనుగోలు చేయటంలేదు. దీనికి అస లు కారణమేంటని ఆరాతీస్తే అప్పు కష్టా లు బయటకొచ్చాయి. ధాన్యం కొనలేక.. కొన్నా డబ్బు చెల్లించలేక, ఎఫ్‌సీఐను అడ్డుపెట్టుకుని ఈ తతంగాన్ని పూర్తిచెయ్యాలనే లోపాయకారి ఆలోచనకు పౌరసరఫరాల శాఖ వచ్చినట్టు ఆ శాఖ ఉన్న తాధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కస్టమ్ మిల్ల్‌డ్ రైస్(సి.ఎం.ఆర్) విధానంతో ధాన్యం కొనుగోలుచేసి, మిల్లర్ల ద్వారా మరాడించి, రేషన్ పంపిణీకి తరలిస్తుంది. అయితే ఈ విధానంలో తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలుచేసి, వాటి ని ఈ తరహాలో పేదల బియ్యం కింద పంపేందుకు సిద్ధపడితే అటు పేదల బియ్యం ఇబ్బందులు, ఇటు రైతుల గిట్టుబాటు సమస్యలు రెండూ తీరతాయి. అయితే ప్రస్తుతం ఈ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఎఫ్‌సీఐ నిబంధనలు అడ్డు
తడిచిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధపడినా, ఆ ధాన్యం మరాడించగా వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ మాత్రం సుముఖంగా లేదు. ఎఫ్‌సీ ఐ కొనే ప్రతి గింజనూ పరీక్షించి అంతా బాగుంటేనే ఆ బియ్యా న్ని కొనుగోలు చేస్తుంది. అయితే డబ్బు మాత్రం రెండు రోజుల్లోనే చెల్లించేస్తుంది. అందుకే ఎఫ్‌సీఐ డబ్బుతో తమ కష్టాలనుంచి గట్టెక్కొచ్చని పౌరసరఫరాల శాఖ ఆలోచించినట్టుంది. ప్రస్తుతం తేమ, రంగమారి, మొలకలొచ్చిన నాశిరకం ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం గింజల శాతాలు ఎఫ్‌సీఐకి వర్తించవు. నాసిరకం గింజల కొనుగోళ్లలో ఐదు నుంచి పది శాతానికి రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా, వాటిని ఎఫ్‌సీఐ తీసుకోని పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం నాణ్యమైన బియ్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే మన రాష్ట్రంలోని పౌరసరఫరాల అవసరాలకు ఏటా 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నా, వీటినయినా ఎఫ్‌సీఐ కొనుగోలుచేసి, వాటిని మనకే పంపేలా ఒప్పందం వంటివి కూడా జరగకపోవటం సమస్యను మరింత జఠిలం చేస్తోంది.
చేతులు దులుపుకుంటే సరా!
అప్పుల్లో కూరుకుపోయిన పౌరసరఫరాల శాఖకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు వెయ్యాలని ఆదేశాలిచ్చింది. కానీ ఆచరణలో డొల్లతనం వెక్కిరించేలా ఉంది. పరపతికూడా దక్కని ఆ శాఖ ఎక్కడి నుంచి డబ్బుతెచ్చి రైతులకిస్తుందనే ఆలోచనా ప్రభుత్వం చేయలేదు. తుపానుకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో పౌరసరఫరాల శాఖకు నిధులూ విడుదల చేయలేదు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏం చెయ్యా లి! రైతులకు డబ్బెక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనే సందేహాలతో చివరకు ఎఫ్.సి.ఐ తాము కొన్న ధాన్యాన్ని మరాడించి, బియ్యాన్ని పంపి, వారిచ్చే డబ్బును రైతుకు పంపాలనే ఆలోచనకు పౌరసరఫరాల శాఖ వచ్చిందనేది ఆశాఖ లోని సిబ్బంది చెబుతున్న లోగు ట్టే. అయితే ఆచరణలో మాత్రం దీనికీ సవాలక్ష మెలికలున్నాయి.
42 మిల్లులు మాత్రమే గ్యారంటీ..
ఇటువంటి ఇబ్బందుల మద్య నలిగిపోవటమెందుకని మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు తీయటానికి, పౌరసరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని తీసుకోటానికి సుముఖత చూపటంలేదు. గతేడాది జిల్లాలో 140కిపైగా మిల్లులు బ్యాంకు గ్యారంటీలు చూపి, ధాన్యం కొనుగోలు చేసేందు కు ముందుకు వస్తే, ఈ సారి కేవ లం 42 మిల్లులు మాత్రమే గ్యారంటీలు చూపాయి. దీంతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది ధాన్యం కొనటానికికూడా ఇది పెద్ద అడ్డంకిగానే మా రింది. అయితే క్షేత్రస్థాయిలో ఎదు రవుతున్న ఇబ్బందులను అటు వ్యవసాయశాఖ, ఇటు పౌరసరఫరాల శాఖ అసలు పట్టించుకోకుం డా మీ తిప్పలు మీరు పడండన్న ట్టు వదిలేయటంతో రైతులు తీవ్రం గా నష్టపోవలసిన పరిస్థితి. అయితే పౌరసరఫరాల శాఖ మాత్రం ఇవేమీ నిజం కాదని, తామే ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లిస్తామని, డబ్బు చెల్లించటం ముఖ్యం కానీ, ఏ రూపంలో అయితే ఏమని ప్రశ్నించటం కొసమెరుపు. ఇన్ని చిక్కుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్కరించి కొనుగోళ్లలో సమస్యలను అధికమిస్తేనే రైతులకు నిజంగా మేలు జరుగుతుంది.