-
-
Home » Andhra Pradesh » Guntur » cheneta
-
చేనేతకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
ABN , First Publish Date - 2020-12-30T06:09:00+05:30 IST
చేనేతకు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి
మంగళగిరి, డిసెంబరు 29: చేనేతకు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏపీ చేనేత కార్మిక సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. చేనేతరంగం అభివృద్ధి చెందాలంటే 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టాలను అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్‌లూమ్ అడ్వయిజరీ బోర్డును పునరుద్ధరించాల్సి ఉందన్నారు. హ్యాండ్‌లూమ్ ఇన్‌చార్జి అడిషనల్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని సహకార సంఘాల బకాయిలను రద్దు చేశామని, సహకార సంఘాల్లో పేరుకుపోయిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని చెప్పారు. మాస్టర్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు మాట్లాడుతూ మగ్గాల షెడ్డులకు వేసిన కమర్షియల్ టాక్స్‌ను ఎత్తివేయడంతో పాటు చేనేత కేంద్రాల్లో విక్రయకేంద్రాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. అనంతరం ఏపీ చేనేత కార్మికసంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కట్టా హేమసుందరరావు, జింకా చలపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు జి బాలాజీ, నియోజకవర్గ కార్యదర్శి బి మోహనరావు, హ్యాండ్‌లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీ సొసైటీ మెంబరు జె.భారతి, సీహెచ్ విజయలక్ష్మి, బి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.