నకిలీ బంగారం తాకట్టు పెట్టి... రూ.10 లక్షలకు టోపీ

ABN , First Publish Date - 2020-02-16T07:21:45+05:30 IST

నకిలీ బంగారం తాకట్టు పెట్టి... రూ.10 లక్షలకు టోపీ

నకిలీ బంగారం తాకట్టు పెట్టి... రూ.10 లక్షలకు టోపీ

మంగళగిరి క్రైమ్‌, ఫిబ్రవరి 15: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారికి రూ.పది లక్షలు టోపీ పెట్టిన ఉదంతం మంగళగిరిలో వెలుగుచూసింది. మంగళగిరి అర్బన్‌ సీఐ ఎస్‌.శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మంగళగిరి పట్టణంలోని నేతాజీ కాంప్లెక్సులో గుండా రామమోహనరావు పాన్‌బ్రోకర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి మనుమడు  చక్రవర్తి తాత వద్దనే ఉంటూ వ్యాపార లావాదేవీలు చూస్తున్నాడు. వెనిగళ్ల సాంబశివరావు అనే స్వర్ణకారుడు వీరికి ఎంతోకాలం నుంచి నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. 

సాంబశివరావు పలుమార్లు బంగారు వస్తువులను రామమోహనరావు దుకాణంలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకువెళ్లేవాడు. గత మూడేళ్లలో 11 దఫాలుగా 316 గ్రాముల బంగారు వస్తువులను తాకట్టు పెట్టి సుమారు రూ.పది లక్షల నగదు తీసుకున్నాడు.  సంవత్సరాలు గడుస్తుండడంతో బంగారు వస్తువులు తీసుకువెళ్లాలని సాంబశివరావుపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన చక్రవర్తి తాకట్టు నగలను పరీక్షించగా సాంబశివరావు కుదవ పెట్టిన నగలన్నీ నకిలీ బంగారంగా తేలింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాంబశివరావు తాకట్టు పెట్టిన 316 గ్రాముల బంగారు వస్తువులు, 200 గ్రాముల నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-16T07:21:45+05:30 IST