వైజాగ్‌ నుంచి ముంబయికి గంజాయి

ABN , First Publish Date - 2020-02-16T07:33:00+05:30 IST

వైజాగ్‌ నుంచి ముంబయికి గంజాయి

వైజాగ్‌ నుంచి ముంబయికి గంజాయి

  • ఎక్సైజ్‌, ఆర్‌పీఎఫ్‌ సంయుక్త దాడులు
  • గుంటూరు రైల్వేస్టేషన్‌లో పట్టుబడిన 120 కేజీల గంజాయి
  • ముగ్గురు ముంబయి వాసుల అరెస్టు


గుంటూరు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 15: వైజాగ్‌ నుంచి ముంబయికి గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ముంబయికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు గుంటూరు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ శనివారం రాత్రి తెలిపారు. గుంటూరు ఎక్సైజ్‌ ఏఈఎస్‌ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వినయ్‌కుమార్‌, ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సరోజ్‌కుమార్‌, వారి సిబ్బందితో సంయుక్తంగా గుంటూరు రైల్వేస్టేషన్‌లో దాడులు నిర్వహించారు. దాడుల్లో అక్రమంగా 120 కేజీల గంజాయిని తరలిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. ముంబయిలోని థానే ప్రాంతానికి చెందిన షేక్‌ అబీద్‌ ఇర్ఫాన్‌, షేక్‌ ఆలీ హుపెన్‌, మహ్మద్‌ సబార్‌ అనే ముగ్గురు గంజాయిని కొనుగోలు చేసి అమ్ముతుంటారు. అదే క్రమంలో విశాఖపట్నం నుంచి 120 కేజీల గంజాయిని సుమారు రూ.6 లక్షలకు కొనుగోలు చేసి సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వారు గంజాయిని తీసుకొచ్చారు. గుంటూరులో దించి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో తరలించే క్రమంలో పక్కా సమాచారంతో ఎక్సైజ్‌, ఆర్‌పీఎఫ్‌ అధికారులు సంయుక్త దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని సుమారు రూ.24 లక్షలకు ముంబయిలో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌ సిబ్బంది రాజేంద్ర, గోపీకృష్ణ, రవి, జ్యోతి, శంకర్‌, అనిల్‌, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది శ్రీనివాసరావు, హోంగార్డు సాగర్‌బాబు, రవికిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T07:33:00+05:30 IST