బయోమెట్రిక్‌కు.. ఇదేం మెలిక!

ABN , First Publish Date - 2020-04-14T14:43:30+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు..

బయోమెట్రిక్‌కు.. ఇదేం మెలిక!

లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులకు అందని బియ్యం

ప్రధానోపాధ్యాయుల వేలిముద్రకు అనుమతి లేకపోవమే కారణం

విద్యాశాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల సమన్వయ లోపం


గుంటూరు(విద్య): లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు కేజీల బియ్యం, గుడ్లు అందించాలని ప్రభుత్వం సూచించింది. గుంటూరు నగరంలోని కొన్ని పాఠశాలల పరిధిలో ఇది అమలు కావడం లేదు. కారణం ప్రధానోపాధ్యాయుల బయోమెట్రిక్‌లో ఇబ్బందు ఏర్పడడమే..! వివరాల్లోకి వెళితే..


మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం పాఠశాలలకు బియ్యం అందజేస్తుంది. ఆ బియ్యంతోనే ఏజన్సీలు వండి విద్యార్థులకు వడ్డించాలి. బియ్యం పాఠశాలలకు చేరాలంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన విద్యార్థుల సంఖ్యను అనుసరించి విద్యాశాఖ అధికారులకు, తహసీల్దారు కార్యాలయానికి ఇండెంట్‌ పంపాలి. తహసీల్దారు అనుమతితో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆయా పాఠశాలలకు ఆయా ఏరియాల చౌకడిపోల ద్వారా బియ్యం అందజేస్తారు. ఆ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బయోమెట్రిక్‌ తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు అందుబాటులో లేకుంటే  వంట ఏజన్సీ నుంచి ఒకరు బయోమెట్రిక్‌ వేయాలి. 

 

గుంటూరులో నగరంలో ఏడాది కిందట ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించారు. ఆ సమయంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రధానో పాధ్యాయులు చాలామంది బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారు తాము బాధ్యతలు చేపట్టిన పాఠశాల నుంచి మధ్యాహ్న భోజన పథకం బియ్యం తీసుకునేందుకు గతంలో ఉన్న ప్రధానోపాధ్యాయుని పేరు తొలగించి తమపేర్లు సంబంధిత పాఠశాల తరపున నమోదు చేయాలని గుంటూరు ఎంఈవో లిఖితపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు ఇస్తేనే తాము అంగీకరిస్తానంటూ ఆయన వినతుల్ని పక్కన పెట్టారు. దీంతో సంబంధిత ప్రధానోపాధ్యాయులు బియ్యం తీసుకునేందుకు వీల్లేకుండాపోయింది.


గుంటూరు తూర్పులోని బసవతారకం రామనగర్‌లోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో అటు ప్రధానోపాద్యాయులది, ఇటు ఏజన్సీది ఇద్దరిది బయోమెట్రిక్‌ నమోదు కాకపోవడంతో ఆ పాఠశాలకు బియ్యం ఇచ్చేందుకు చౌక డిపోడీలర్‌ ఏడాది కాలంగా ఇవ్వడం లేదు. దీంతో వంట ఏజన్సీలే అప్పులు చేసి బియ్యం తెచ్చి వండటం లేదా పక్క పాఠశాలల నుంచి తీసుకురావడం చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కూల్‌ విద్యార్థులకు అనేక చోట్లు బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. అయితే నగరంలో అనేక చోట్ల ఈ పంపిణీలో ఇబ్బందులు వస్తున్నాయని ఏజన్సీలు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.


మధ్యాహ్న భోజనం పంపిణీ కోసం బియ్యం ఇవ్వని పాఠశాలలకు దానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఈ సమస్య దాదాపు 25శాతం పాఠశాలల్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యాశాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సమన్వయంతో సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-04-14T14:43:30+05:30 IST